English | Telugu
మరో క్రేజీ కాంబినేషన్‌లో పవర్‌స్టార్ కొత్త సినిమా.. త్వరలోనే ప్రారంభం?
Updated : Oct 4, 2025
చాలా కాలం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఖాతాలో ఓ భారీ హిట్ నమోదైంది. కలెక్షన్లపరంగా పవన్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాస్టర్‌గా ‘ఓజీ’ నిలుస్తోంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పైనే అందరి చూపూ ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని దీపావళి రోజున అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పవన్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుందని అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
రాజకీయాల్లో బిజీ అయిపోవడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం వంటి కారణాల వల్ల హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు నిర్మాణ పరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. పెండింగ్‌లో ఉన్న సినిమాల్లో రెండు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో కొత్త సినిమాకి పవన్‌కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.
గతంలో పవన్‌కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు.. మరో విభిన్న చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. ఒక సందేశాత్మక చిత్రంగా రూపొందిన వకీల్ సాబ్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. మరోసారి అలాంటి ఓ విభిన్నమైన కథతో పవన్‌కళ్యాణ్, దిల్‌రాజు కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. పవన్ కళ్యాణ్ డేట్స్‌ని దిల్‌రాజు కన్‌ఫర్మ్ చేసుకున్నారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఓజీ తర్వాత పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌కి తగిన కథ ఉంటూనే చక్కని సందేశం కూడా సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. అంతేకాదు, ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ ప్రతిష్ఠాత్మకమైన సినిమాకి సరిపోయే కథ, దాన్ని సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడి కోసం దిల్‌రాజు అన్వేషిస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో దిల్‌రాజు ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్ మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ఫ్యాన్స్‌లో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.