English | Telugu

ఇండస్ట్రీలో ఇన్నేళ్లు నంబర్ వన్‌గా కొనసాగడం నయన్‌కే సాధ్యం!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు నయనతార. త‌మిళ 'బిల్లా' చిత్రంలో బికినీ వేసి సంచ‌ల‌నం సృష్టించింది. దాంతో ఆమె తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య దేవత అయిపోయింది. సౌత్ లో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈమె పెద్ద స్టార్. అనుష్క, కీర్తి లాంటి వారు ఎంతమంది పోటీకొచ్చిన ఆమెను కొట్టే సత్తా మాత్రం ఇప్పట్లో ఎవరికి లేదు.

టాలీవుడ్ లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసినప్పటికీ ఇక్కడ కూడా ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ మాత్రం వెరీ స్పెషల్. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి నయనతార. ఇదే తరహాలో తన రేంజ్‌ను మెయింటైన్ చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలప్రస్థానంలో ఇలా ఏకఛత్రాధిపత్యంగా సౌత్ ఇండియాను ఏలుతున్న హీరోయిన్ అంటే మామూలు విషయం కాదు. హీరో రేంజ్, సినిమా బడ్జెట్, మ్యాటర్ ఉన్న దర్శకుడా కాదా?.. అన్న విషయాలు ఆలోచించి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ ఉంటుంది.

అంతేకాదు.. తాను నటించే చిత్రాలలో తనకు తగిన ప్రాధాన్యం ఉండాలని ఆశపడుతుంది. అలాంటి సినిమాలు వస్తేనే ఓకే అంటుంది... లేకపోతే నో చెప్తుంది. ఆమెతో నటించాలని చాలామంది హీరోలు ఇప్పటికీ ఆశపడుతున్నారు. యంగ్‌ హీరోలతో వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతోన్న‌కొత్త‌వారు కూడా ఆమె త‌మ‌కి జోడీగా న‌టించాల‌ని కోరుకుంటూ ఉంటారు. ఇక సీనియర్ స్టార్స్ అంద‌రు ఆమెతో జోడి కట్టాలని అనుకుంటున్నారు. కానీ ఆ అవ‌కాశం అందరికీ ఇవ్వదు. కొందరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. ఏ సినిమా విషయంలోనైనా ఆమె నిర్ణయాలకు దర్శక నిర్మాత‌లు మాత్రం కట్టుబడి ఉండాలి. స్టార్ హీరోలు సినిమాలను ఎలా శాసిస్తున్నారో ఈమె అలా సినీ దర్శకనిర్మాతల‌ను శాసిస్తోంది.

తాజాగా ఈమె మాట్లాడుతూ, "పరిశ్రమలో ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సవాళ్ల‌ను స్వీకరించాను. వాటిని సాధించుకుని ముందుకు సాగాను. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా మొండిగా పోరాటం చేశాను. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాను. సమస్యలు వచ్చాయని బెదిరిపోను. వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్లడమే జీవితం అని వాటిని స్వీకరించినప్పుడే అర్ధమవుతుంది. ఏ సినిమాకైనా ప్రాంతంతో పనిలేదు. అందులోని పాత్రలు బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు.వినూత్న కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు" అని చెప్పుకొచ్చింది.

ఇక నయనతార ఇటీవ‌ల ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటిన కంగనా రనౌత్ తరహాలో ఫేమస్ అవుతోంది. స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు వచ్చినా కూడా చాలా సెలెక్టివ్ గా మాత్రమే ఎంపిక చేసుకుంటుంది...!