English | Telugu
చిక్కుల్లో అజిత్ డైరక్టర్... ఫైర్ అవుతున్న అభిమానులు
Updated : Jan 10, 2023
అజిత్ లాంటి స్టార్ హీరో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు అవకాశం ఇచ్చారంటేనే హెచ్. వినోద్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా మీద ప్యాషన్ ఉన్న డైరక్టర్ వినోద్ అని తన సన్నిహితులతో చాలా సార్లు చెప్పారట అజిత్. 'నెర్కొండ పార్వై', 'వలిమై', ఇప్పుడు 'తునివు' సినిమాలతో అజిత్‌ని డైరక్ట్ చేసిన హ్యాట్రిక్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు వినోద్. 'తునివు' జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడారు వినోద్. ఇందులో భాగంగానే ఆయన అభిమానులను ఉద్దేశించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ని ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి.
అసలు వినోద్ ఏమన్నారంటే... "సినిమా అనేది కేవలం వినోద సాధనమే. సినిమా విడుదలైనప్పుడు టిక్కెట్లు దొరికితే చూసి ఆస్వాదించి వచ్చేయడమే కరెక్ట్. అంతకు మించి సినిమా కోసం ఎవరూ సమయాన్ని కేటాయించకూడదు. సినిమా రిలీజ్ కి ముందు నుంచి చాలా మంది తమ విలువైన సమయాన్ని సినిమాల ప్రమోషన్లకు వాడుతుంటారు. అలా వాడటం వల్ల కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ప్రొడ్యూసర్లకు దక్కుతుంది.అది వారి సినిమాల కలెక్షన్లకు అమితంగా ఉపయోగపడుతుంది. కానీ, ప్రేక్షకులకు దీని వల్ల దక్కే లాభం ఏంటి? అభిమానులు అంత కష్టపడి పనిచేశారని ఎవరైనా గుర్తుంచుకుంటారా? అసలు నిర్మాతగానీ, హీరోగానీ రిటర్న్ గిఫ్ట్ లు ఏమైనా ఇస్తారా? అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు తమ విలువైన సమయాన్ని అలా ఖర్చు చేయాలి? నేనైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను"అని అన్నారు.
వినోద్ చెప్పిన మాటలు ముమ్మాటికి నిజం అంటున్నారు కొందరు. కానీ అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. "సినిమా రిలీజ్‌కి ముందు ఇలాంటి కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలుండాలి? అసలు ఇవేం మాటలు?" అంటూ తిడుతున్నారు.