English | Telugu

సైబర్‌ నేరగాళ్ళ వలలో అంజలి.. లక్షల్లో మోసపోయిన వైనం!

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సైబర్‌ నేరాలు చేస్తూ సామాన్య ప్రజలనే కాదు, ప్రముఖులను కూడా బుట్టలో వేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వీరి వలలో చిక్కుకుంటున్నారంటే ఎంత టాలెంట్‌గా వారిని డీల్‌ చేస్తున్నారో అర్థమవుతుంది. తాజాగా ఓ ప్రముఖ నటి సైబర్‌ నేరగాళ్ళ వలలో చిక్కుకొని లక్షల్లో నష్టపోయింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు, తెలుగు, హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు సొంతం చేసుకున్న అంజలి పాటిల్‌ చిక్కుల్లో పడిరది.


రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో తెలుగులో రూపొందిన ‘నా బంగారు తల్లి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అంజలి ఈ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చెయ్యలేదు. అయితే హిందీ, మరాఠి చిత్రాలతో బిజీ అయిపోయింది అంజలి. ఎంతో ఇంటెలిజెంట్‌ అనే పేరు తెచ్చుకున్న అంజలి ఎంతో అమాయకంగా మోసపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అసలేం జరిగిందంటే.. అంజలికి డిసెంబర్‌ 28న దీపక్‌ శర్మ అనే వ్యక్తి కాల్‌ చేసి తాను ఫెడ్‌ఎక్స్‌ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. అంజలి పాటిల్‌ పేరుతో ఉన్న ఒక పార్సిల్‌ తైవాన్‌లో పట్టుపడిరదని, అందులో డ్రగ్స్‌ ఉన్నాయని తెలిపారు. ఆ పార్సిల్‌లో ఆధార్‌ కార్డు కూడా ఉందని చెప్పడంతో అంజలి ఒక్కసారిగా షాక్‌ అయిపోయింది. ఆ షాక్‌లో మరో ఆలోచన చేయకుండా తన ఆధార్‌ కార్డు దుర్వినియోగం జరిగిపోతుందనే భయంతో వణికిపోయింది. ఫోన్‌ చేసిన వ్యక్తికి తాను సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్‌ చేస్తానని చెప్పింది. కొద్ది సేపటి తర్వాత బెనర్జీ అనే వ్యక్తి అంజలికి కాల్‌ చేశాడు. తాను సైబర్‌ క్రైమ్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీ ఆధార్‌ కార్డుకు 3 బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉన్నాయని, అవి మనీ లాండరింగ్‌ కేసులో ఇరుకున్నాయంటూ అంజలిని మరింత భయపెట్టాడు. ఆ అకౌంట్స్‌ను ఫ్రీజ్‌ చేయించాలంటే రూ.96,525 పంపించాలని అంజలితో చెప్పాడు. అప్పటికే బాగా టెన్షన్‌లో ఉన్న అంజలి అతడు చెప్పిన అకౌంట్‌కి డబ్బు పంపించింది. తర్వాత దీనిపై ఇన్వేస్టిగేషన్‌ జరుగుతుందని, అందుకోసం మరో రూ.4,83,291 డబ్బు పంపించాలని చెప్పాడు. అతను అడిగినట్టుగానే మళ్ళీ డబ్బు పంపించింది. అయితే ఆ తర్వాత ఆమెకు అర్థమైంది తాను మోసపోయానని. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో కాన్షస్‌తో ఉండే సెలబ్రిటీలే ఇంత ఈజీగా మోసపోతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటున్నారు విషయం తెలుసుకున్న వారు.