English | Telugu
'ద స్కార్పియన్ కింగ్'ను రీమేక్ చేయబోతున్న ద రాక్!
Updated : Nov 12, 2020
కండల వీరుడు డ్వేన్ జాన్సన్ (ద రాక్) 'ద స్కార్పియన్ కింగ్' మూవీని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీతోనే ఆయన హాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఈ రీమేక్‌ను డెవలప్ చేయడానికి ఈ 48 సంవత్సరాల యాక్టర్ యూనివర్సల్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు. దీనికి స్క్రిప్ట్ రూపొందించేందుకు 'స్ట్రెయిట్ ఔటా కాంప్టన్' ఫేమ్ జోనాథన్ హెర్మన్‌ను తీసుకున్నారు.
బ్రెండన్ ఫ్రేజర్ రూపకల్పన చేసిన 'ద మమ్మీ' సీరిస్‌కు' ద స్కార్పియన్ కింగ్' స్పినాఫ్ మూవీ. 2001లో వచ్చిన 'ద మమ్మీ రిటర్న్స్'లో స్కార్పియన్ కింగ్ విలన్‌గా కనిపించడం మనకు తెలుసు. ఆ పాత్రను చేసింది జాన్సనే. 'ద మమ్మీ'కి ప్రీక్వెల్ అయిన 'ద స్కార్పియన్ కింగ్' మూవీ డిజర్ట్ వారియర్ మత్తయూస్ (డ్వేన్ జాన్సన్) కథను తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ మూవీ 178.7 మిలియన్ డాలర్లను ఆర్జించి, అంతదాకా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్‌స్టార్‌గా ఉన్న జాన్సన్‌ను హాలీవుడ్‌కు హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది.
ఇప్పుడు ఒరిజినల్‌కు భిన్నమైన సమకాలీన నేపథ్యంతో ఈ మూవీని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డ్వేన్ జాన్సన్‌తో పాటు సెవన్ బక్స్ ప్రొడక్షన్స్ అధినేత డానీ గార్సియా ఈ మూవీని నిర్మించనున్నారు.
