English | Telugu

వయనాడ్‌ బాధితుల కోసం ఆనాటి టాప్‌ హీరోయిన్ల భారీ విరాళం!

దేశంలోనే అతి పెద్ద ప్రకృతి విపత్తుగా కేరళలోని వయనాడ్‌ ఘటన నిలిచింఇ. జిల్లాలో వరద ప్రభావం వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య400లకు చేరింది. ఇంకా వందల మంది ఆచూకీ లభ్యం కాలేదు. కొన్నివందల మంది గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజల మనసులు కలచివేసిన ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు తమ విరాళాలను ప్రకటించడమే కాదు, స్వయంగా కేరళ సీఎం సహాయనిధి కోసం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు.

కోలీవుడ్‌ నుంచి విక్రమ్‌, సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార వంటి ప్రముఖులు విరాళాలు అందించారు. టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి 1 కోటి రూపాయలు, అల్లు అర్జున్‌ 25 లక్షలు అందించగా, ప్రభాస్‌ అందరి కంటే ఎక్కువగా 2 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు టాప్‌ హీరోయిన్లుగా వెలుగొందిన నటీమణులు సుహాసిని, ఖుష్‌బూ, మీనా, శ్రీప్రియ, లిజి లక్ష్మి, కళ్యాణి ప్రియదర్శన్‌, శోభన అందరూ కలిసి 1 కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రిని కలిసి చెక్‌ రూపంలో అందజేశారు.దీనికి సంబంధించిన ఫోటోలను సీనియర్‌ హీరోయిన్‌ మీనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘చెన్నయ్‌లోని కొందరు హీరోయిన్లు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల తరఫున కోటి రూపాయలు కలెక్ట్‌ చేసి వయనాడ్‌ బాధితుల కోసం ముఖ్యమంత్రికి అందజేశాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వయనాడ్‌ ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అని పోస్ట్‌ చేశారు.