English | Telugu
అల్లు అర్జున్ తప్పు చేశాడా..?
Updated : Aug 4, 2025
గత కొంతకాలంగా డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు.. స్టార్స్ తో సంబంధం లేకుండా పలు సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 'హనుమాన్', 'కాంతార' వంటి సినిమాలను వాటికి ఉదాహరణగా చెప్పవచ్చు. దీంతో స్టార్స్ సైతం డివోషనల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తప్పు చేశాడా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'పుష్ప-2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉంది. కానీ, ఆ సినిమా చేయడం కంటే.. అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేయడానికి బన్నీ మొగ్గుచూపాడు. దీంతో ఆ మైథలాజికల్ ఫిల్మ్ ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. ఇది 'గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి' కథతో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ మిస్ చేసుకోవడంపై.. అప్పుడే ఆయన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు 'మహావతార్ నరసింహ' సినిమాతో.. వారు మరింత నిరాశ చెందుతున్నారు.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన యానిమేషన్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. రూ.200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఒక యానిమేషన్ సినిమాకే ఈ రేంజ్ రెప్సన్స్ వస్తుందంటే.. ఇక స్టార్ నటించిన మైథలాజికల్ మూవీకి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పైగా, త్రివిక్రమ్ కి పురాణాలపై ఎంతో పట్టుంది. ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో అంతటి పట్టు ఎవరికీ లేదనే అభిప్రాయాలున్నాయి. తన రెగ్యులర్ సినిమాల్లో సైతం పురాణాలను ప్రస్తావిస్తుంటాడు త్రివిక్రమ్. అలాంటి దర్శకుడు.. కుమారస్వామి కథతో మైథలాజికల్ ఫిల్మ్ చేస్తున్నాడంటే.. కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించే అవకాశాలున్నాయి.
ఏది ఏమైనా.. అల్లు అర్జున్ ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ చేసే అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.. కానీ, త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో మైథలాజికల్ ఫిల్మ్ చేసే అవకాశం అరుదుగా వస్తుందని.. అలాంటి అవకాశాన్ని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.