English | Telugu

మళ్ళీ ఆశలు రేపుతున్న చరణ్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేస్తాడా? చేస్తే ఎప్పుడు చేస్తాడు? అసలు చేసే ఉద్దేశం ఉందా? చిరంజీవి 150వ సినిమా చేస్తే చూడాలని అభిమానులు అందరూ చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులతో పాటుగా ఆయన మిత్రులు, సన్నిహితులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ అయితే ఏకంగా చిరంజీవి150వ చిత్రాన్ని నిర్మించడానికి కూడా రెడీగా వున్నాడు. ఆయన సినిమా చేయడానికి ఒప్పుకుంటే దానికి నేనే నిర్మాత అంటూ ఇప్పటికే ప్రకటించేశాడు.

కానీ ఈ మాటలు గత రెండు సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. అయితే రామ్ చరణ్ తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపెట్టాడు. తన తండ్రి కోసం ఇప్పటికే రెండు స్టోరీలు రెడీ అయ్యాయని, చిరంజీవి ఆ స్టోరీలు విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని చరణ్ తెలిపాడు.

అయితే ఈ మాటలు విన్న అభిమానులకు కాస్త ఊరట కలిగించినప్పటికీ, చిరు తన 150వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అది సెట్స్ పైకి వెళ్లి, సినిమా విడుదల కావాలంటే మరో రెండు సంవత్సరాలైనా పట్టేట్లుగా ఉందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. మరి ఈ విషయంపై చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి.