English | Telugu

‘బెంగుళూరు డేస్'తో భాస్కర్‌‌కి హ్యాపీ డేస్ వస్తాయా !


చక్కటి కుటుంబ వాతావరణంలో, ప్రేమకథను జొప్పించి ఆడియెన్సును మెప్పించగల దర్శకుడూ భాస్కర్. తెలుగు చిత్రాలలో విలువలను పెంచే కథలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దవచ్చని బొమ్మరిల్లు చిత్రం ద్వారా భాస్కర్ నిరూపించారు. పరుగు సినిమాతో మరోసారి ప్రేమికుల మధ్య ప్రేమకు, కుటుంబ ప్రేమకు మధ్య వుండే సున్నితత్వాన్ని తట్టి చూపారు. ఆ తర్వాత తన పంతా కొంత మార్చేసి రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్ చిత్రం నిర్మాతలకు, దర్శకుడు భాస్కర్ కు నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత రూపొందించిన భాస్కర్ నాలుగో చిత్రం ఒంగోలు గిత్త కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సంపాదించుకోలేక పోయింది. మొదటి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.


సొంత సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో ఈసారి భాస్కర్ కొత్త పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఓ మలయాళం సినిమా రీమేక్ కు దర్శకత్వ బాధ్యతలు వహించనున్నాడని సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బెంగుళూరు డేస్' చిత్రం రైట్స్ దిల్ రాజు తీసుకున్నారని, ఆ సినిమాకు భాస్కర్ డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. కథలు ఎంచుకునే విషయంలో దిల్ రాజుకి గల అభిరుచి గురించి చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందితే తప్పకుండా బొమ్మరిల్లు లాంటీ విజయాన్ని అందుకోగలరని ఆశిద్దాం. అభిరుచి గల నిర్మాత, కథను అందంగా తెరకెక్కించగల దర్శకుడు, మంచి కథ ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే విజయం ‘బెంగుళూరు డేస్' సినిమాకి దక్కుతుంది... ఏమంటారు...