English | Telugu
అస్తమించిన నటసామ్రాట్ అక్కినేని
Updated : Jan 21, 2014
తెలుగు సినిమా ఇండస్ట్రీకి అగ్ర నటులు ఎవరు అంటే... ముందుగా ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటారు. ఆ తర్వాత స్థానం మాత్రం ఖచ్చిత్రంగా అక్కినేని నాగేశ్వరరావుకే చెందుతుంది. అంతటి పేరును సంపాదించుకున్నారు ఆయన.
అలాంటి అక్కినేని నేడు ఉదయం 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్ లొని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అక్కినేని గతకొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు. ఎమెర్జెన్సీ డాక్టర్లు ఆయనకు ఆక్సిజన్ అందించినప్పటికీ, విషయం తెలుసుకున్న డాక్టర్ సోమరాజు మరియు ఆయన వైద్య బృందం ఆస్పత్రికి వచ్చి పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు గుర్తించారు. చివరి క్షణాల్లో కుమారుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఆయనతోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కినేని పార్దివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం అన్నపూర్ణ స్టుడియోలో ఉంచారు.
అక్కినేని ఇప్పటితరం వారికి కూడా ఆదర్శం. వయసు మీద పడుతున్న కూడా తన నటనతో అభిమానులను ఇప్పటి వరకు కూడా అలరిస్తూనే వచ్చారు. అప్పట్లో అక్కినేని నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందినవే. ఆయన సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా మారుమ్రోగుతూనే ఉన్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 1944న సినీ రంగ ప్రవేశం చేశారు. "ధర్మపత్ని" ఆయన మొదటి చిత్రం . ప్రస్తుతం అక్కినేని కుటుంబమంతా కలిసి నటిస్తున్న"మనం" చిత్రంతో కలిపి ఇప్పటి వరకు 256 చిత్రాల్లో నటించారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కె, ఎన్జీఆర్ జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు.
అక్కినేని మరణవార్త అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. అక్కినేని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ...తెలుగువన్.కామ్.