English | Telugu
చిరు-బాలయ్య ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి!
Updated : Jan 10, 2023
తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా చిరు, బాలయ్యలకు ఎలాంటి శతృత్వం లేదు. కానీ వృత్తిరీత్యా మాత్రం వీరిద్దరు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతూ ఉంటారు. ఇక వీరి ఫ్యాన్స్ మధ్య అయితే చిన్న చితకా పోటీ ఉండదు. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అని వాదించుకుంటూ ఉంటారు. ఇక తమ ఇద్దరి హీరోల చిత్రాలలో ఏది పెద్ద హిట్? ఏది ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది? ఎవరి చిత్రం ఎన్ని థియేటర్లలో విడుదలైంది? ఎవరి చిత్రం ఎక్కువ సెంటర్స్‌లో శతదినోత్సవాలు, అర్ధ శతదినోత్సవాలు జరుపుకుంది?.. ఇలా ప్రతి ఒక్కటి వారి దృష్టిలో ప్రిస్టేజ్ పాయింట్స్‌గా ఉంటాయి.
ఇప్పుడు కాస్త అది తగ్గుముఖం పట్టినా ఒకప్పుడు మాత్రం వారి దృష్టిలో ప్రతి ఒక్కటి ముఖ్యమే. ఆధారాలతో సహా చూపించుకుంటూ వైరానికి దిగుతూ ఉంటారు. గతంలో వీరి ఫ్యాన్స్ మధ్య వార్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు శతదినోత్సవాలు, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా కలెక్షన్లు, రికార్డులను మాత్రం ఇప్పటికీ వారు సీరియస్‌గా పట్టించుకుంటారు.
అందునా ఇద్దరి చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే ఇక ఎక్కడ ఏ గొడవలు జరుగుతాయో అర్ధం అయ్యేది కాదు. పోలీసులకు కూడా చేతి నిండా పని ఉండేది. తాజాగా ఈ సంక్రాంతికి మరలా ఈ పందెం కోళ్లు రంగంలోకి దిగుతున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అలియాస్ ఆర్ఆర్ఆర్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. "చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి" అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న, బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' ఒకరోజు ముందుగా అంటే జనవరి 12న విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు ట్వీట్ చేస్తూ "చిరంజీవిని జనసేన కింద చూడడం, బాలకృష్ణ ఎలాగూ టిడిపి ఎం.ఎల్.ఎ. కావడంతో ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులే. ఇప్పటికే బాలకృష్ణ, పవన్ పై వైసీపీ నాయకులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలు హిట్ అవ్వాలి.. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి" అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పటికే దిల్ రాజు వల్ల చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఒకటై థియేటర్స్ కోసం పోరాడుతున్నారు. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఈ ట్వీట్ తో మరోసారి చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఒకటై నిజమే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందులో రఘురామ కృష్ణంరాజు చెప్పిన పాయింట్ కూడా ఎంతో విలువైనదిగా భావించాలి. తాజాగా ఆయన చిరు, బాలయ్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ కూడా ముందు జాగ్రత్తగా చేసిందేనని భావించాలి. దీనితో అందరూ అప్రమత్తమవుతున్నారు. బాలయ్య చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఒకటై తమ మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలని అంటున్నారు.
గతంలో చిరంజీవి ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వివాదాలు సృష్టించాడని దాని వలన పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. అదే తరహాలో ఈసారి చిరంజీవి, బాలయ్య మధ్య సినిమాల పరంగా ఉన్నా విభేదాలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ వైసీపీ నేతలు ఎంత దారుణాల కైనా ఒడి కట్టేందుకు వెనుకాడరని రఘురామ కృష్ణంరాజుతో పాటు పలువురు ముందుగా హెచ్చరిస్తున్నారు!