English | Telugu

ఈ వారం అసలుసిసలైన సినిమా పండుగ!

ఈ వేసవిలో చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడే ఎక్కువగా ఉంది. మార్చిలో విడుదలైన 'కోర్ట్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు మంచి వసూళ్లతో ఘన విజయం సాధించాయి. ఏప్రిల్ లో పలు సినిమాలు విడుదలైనా.. ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది. మే నెల పాజిటివ్ గానే స్టార్ట్ అయింది. నాని హీరోగా నటించిన 'హిట్-3' మే 1న విడుదలై మంచి వసూళ్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ వారం కూడా నాలుగో చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఎంటర్టైనర్ 'సింగిల్'. గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవిష్ణు మార్క్ ఎంటర్టైనర్ కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'సింగిల్'పై మంచి అంచనాలే ఉన్నాయి.

సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం'. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా మే 9న విడుదలవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో సమంత అతిథి పాత్రలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్ మెప్పించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది.

శ్రద్ధా శ్రీనాథ్‌, కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'కలియుగమ్ 2064'. ప్రమోద్ సుందర్ దర్శకుడు. ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ మే 9న థియేటర్లలో అడుగుపెట్టనుంది. 2064 లో మనుషులు ఎలా ఉంటారు? అనే పాయింట్ తో సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందింది.

నవీన్ చంద్ర, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాకేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'బ్లైండ్ స్పాట్'. మ్యాంగో మాస్ మీడియా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 9న ప్రేక్షకులను పలకరించనుంది.

మే 9న విడుదలవుతున్న ఈ నాలుగో సినిమాల్లో 'సింగిల్', 'శుభం' ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వారం రీ రిలీజ్ ల సందడి కూడా ఉంది. మే 9న చిరంజీవి 'జగదేక వీరుడు అతిలోక సుందరి', మే 10న అల్లు అర్జున్ 'దేశముదురు' రీ రిలీజ్ అవుతున్నాయి.

ఓటీటీలో కూడా ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించనున్నాయి.

నెట్ ఫ్లిక్స్:

ది మ్యాచ్ మూవీ - మే 7
లాస్ట్ బుల్లెట్ మూవీ - మే 7
జాక్ మూవీ - మే 8
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ - మే 8
ది డిప్లొమాట్ మూవీ - మే 9
ది రాయల్స్ సిరీస్ - మే 9

ఈటీవీ విన్:
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ - మే 8

అమెజాన్ ప్రైమ్ వీడియో:
గ్రామ్ చికిత్సాలయ్ సిరీస్ - మే 9

జీ5:
రాబిన్ హుడ్ మూవీ - మే 10

జియో జియో హాట్ స్టార్:
యువ క్రైమ్ ఫైల్స్ సిరీస్ - మే 5
పోకర్ ఫేస్ సిరీస్ - మే 9