English | Telugu

'ఎన్టీఆర్ 30' సెట్స్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఆయన 'ఎన్టీఆర్ 30' సెట్స్ లో అడుగుపెట్టాడు.

'ఎన్టీఆర్ 30' షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా, తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ మొదలైంది. ఇప్పుడు ఈ సెట్స్ లో సైఫ్ అడుగుపెట్టాడు. మొదటి నుంచి 'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా జాన్వీ, విలన్ గా సైఫ్ నటిస్తారని వార్తలొచ్చాయి. ఇప్పటికే జాన్వీ నటిస్తుందని అధికారికంగా ప్రకటించగా, తాజాగా సైఫ్ సైతం అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చాడు. 'ఎన్టీఆర్ 30'లో తారక్-సైఫ్ ల పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ గా వ్యవహరిస్తున్నారు.