English | Telugu

'NTR30'పై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనాలి బింద్రే. ఎక్కువగా హిందీ సినిమాలు చేసిన ఆమె.. 2002లో గోల్డీ బెహల్ తో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. 2018 లో క్యాన్సర్ బారిన పడిన ఆమె ఆ మహమ్మారిపై పోరాడి గెలిచి మళ్ళీ నటిస్తోంది. తాజాగా ఆమె 'ది బ్రోకెన్ న్యూస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే 'NTR30'తో ఆమె టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను సోనాలి కొట్టిపడేసింది.

'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకొని నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'NTR30'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తారక్ కి జోడీగా ఆలియా భట్, రష్మిక మందన్న, సాయి పల్లవి నటించే అవకాశముందంటూ రోజుకో పేరు వినిపిస్తోంది. అలాగే ఈ ఇందులో తారక్ కి అక్కగా సోనాలి బింద్రే కనిపించనుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా సోనాలి ఈ ప్రచారాన్ని ఖండించింది.

సోనాలి నటించిన 'ది బ్రోకెన్ న్యూస్' సిరీస్ జూన్ 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు తారక్ మూవీలో నటిస్తున్నారంట కదా అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయిన సోనాలి.. "నేనా!.. అసలు ఈ విషయమే నాకు తెలీదు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీని గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఇది రూమర్ అని సోనాలి చెప్పుకొచ్చింది.