English | Telugu

'దుర్గ‌'ను స్వ‌యంగా డైరెక్ట్ చేయ‌నున్న లారెన్స్‌!

రాఘ‌వ లారెన్స్ ఇంత దాకా ఎప్పుడూ చేయ‌ని క్యారెక్ట‌ర్‌ను 'దుర్గ' మూవీలో చేస్తున్నాడు. ఈ యాక్ష‌న్ ఫిల్మ్‌ను అన్బ‌రివ్ అని పిల‌వ‌బ‌డే ఇద్ద‌రు స్టంట్ మాస్ట‌ర్స్‌ డైరెక్ట్ చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాతోటే వారు ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌వ్వాల‌ని అనుకున్నారు. కానీ స్టంట్ డైరెక్ట‌ర్స్‌గా ప‌లు ప్రాజెక్టుల‌తో తీరిక‌లేని ప‌ని ఉండ‌టంతో 'దుర్గ' నుంచి ద‌ర్శ‌కులుగా వారు త‌ప్పుకున్నారు. దీంతో తాజాగా లారెన్స్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల‌ని డిసైడ్ అయ్యాడు.

లారెన్స్ ఇప్ప‌టికే 'ముని', 'కాంచ‌న‌', 'కాంచ‌న 2' లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌ను డైరెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే 'కాంచ‌న‌' హిందీ వెర్ష‌న్‌ 'ల‌క్ష్మీ బాంబ్‌'తో బాలీవుడ్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో త‌ను హీరోగా న‌టిస్తోన్న 'దుర్గ' మూవీతో స్టంట్ మాస్ట‌ర్స్ అన్బ‌రివ్ డైరెక్ట‌ర్స్‌తో ప‌రిచ‌యం అవుతున్నట్లు లారెన్స్ ఎనౌన్స్ చేశాడు. అయితే మార్చిలో తాము ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు అన్బ‌రివ్ ప్ర‌క‌టించారు. తాము డైరెక్ట‌ర్స్ అవ్వాల‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి, అనుకోకుండా స్టంట్ మాస్ట‌ర్స్ అయ్యామ‌నీ, రాఘ‌వ లారెన్స్ మాస్ట‌ర్ మంచి మ‌న‌సుతో త‌న సొంత సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం త‌మ‌కిచ్చార‌నీ వారు చెప్పారు. అయితే ప‌లు సినిమాలకు స్టంట్ డైరెక్ట‌ర్స్‌గా ప‌నిచేస్తున్నందున‌, వాటి షెడ్యూళ్లు కార‌ణంగా లారెన్స్ ఇచ్చిన అద్భుత‌మైన అవ‌కాశాన్ని వ‌దులుకోవాల్సి వ‌స్తోంద‌నీ వారు తెలిపారు. లారెన్స్ మాస్ట‌ర్ త‌మ‌ను అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నామ‌నీ, ఆ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నామ‌నీ అన్నారు.

'కాంచ‌న' సిరీస్ త‌ర‌హాలోనే 'దుర్గ' కూడా యాక్ష‌న్ మేళ‌వించిన‌ హార‌ర్ కామెడీ త‌ర‌హాలో రూపొంద‌నున్న‌ది. శ్రీ రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లారెన్స్ స్వ‌యంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.