English | Telugu
ఆకట్టుకుంటున్న 'శాకుంతలం' ట్రైలర్!
Updated : Jan 9, 2023
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. దిల్‌రాజు సమర్పణలో గుణటీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలము' ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
'శాకుంతలం' సినిమాతో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు దర్శకుడు గుణశేఖర్. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. తాజాగా విడుదలైన 'శాకుంతలం' ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ విజువల్ ట్రీట్ లా ఉండబోతుందని అర్థమవుతోంది. మేనక-విశ్వామిత్రల ప్రేమకు గుర్తుగా పుట్టిన శకుంతల అనాథలా మిగిలిపోవడం, యుక్త వయసులో దుష్యంతుడితో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కోవడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యుద్ధ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మణిశర్మ అందించిన నేపథ్యసంగీతం ట్రైలర్ కు అదనపు బలంగా నిలిచింది. ఇక ట్రైలర్ చివరిలో భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. 3డి ఫార్మాట్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.