English | Telugu
11 భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్ లో 'హనుమాన్' విడుదల!
Updated : Jan 9, 2023
ఒక్క టీజర్ తోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా ప్రధాన పాత్రధారిగా ప్రశాంత్ వర్మ దర్శత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ టీజర్ ఇటీవల విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను తలదన్నేలా గ్రాఫిక్స్ ఉందని ప్రశంసలు దక్కాయి. ఇక ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది.
అంజనాద్రి అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ తో కలిసి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇంతకాలం ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లు చెప్పిన మేకర్స్.. తాజాగా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీస్థాయిలో మే 12న విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ ఇలా మొత్తం 11 భాషల్లో విడుదల కానుంది.
తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
