English | Telugu
సత్యసాయి మహా నిర్యాణం
Updated : Apr 24, 2011
పుట్టపర్తిలో పవిత్ర ప్రశాంతి నిలయంలో శాంతి కరువైంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏప్రెల్ 24 వ తేదీన ఉదయం 7.40 నిమిషాలకు మహా నిర్యాణం చెందారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తుల గుండెలు అంతులేని శూన్యంతో బరువెక్కాయి. వారి దైవం ఇక కనపడరు అని తెలిసిన చేదు నిజం వారిని అయోమయానికి గురి చేసింది. సత్యసాయిని భగవంతుడిగా నమ్మే భక్తులు దేశవిదేశాల్లో కోట్లల్లో ఉన్నారు.
మనదేశంలో క్రికెట్ గాడ్ గా పిలువబడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సతీ సమేతంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరి, సత్యసాయి బాబా పార్దివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అదే సమయంలో ప్రముఖ గాయని, తెల్ల కోయిలగా పిలువబడే పద్మశ్రీ పి.సుశీల కూడా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఉంచిన బాబా పార్దివ దేహానికి సుదీర్ఘ శోకంతో నివాళులర్పించారు. ఏప్రెల్ 25 వ తేదీ ఉదయం 10.30 గంటలకు దాదాపు లక్షమంది బాబా భక్తులు పార్దివ దేహాన్ని సందర్శించుకున్నారు.
బాబా గత కొన్నాళ్ళుగా అస్వస్తులుగా ఉన్నారు. ఆయన ఆరోగ్య విషయంలో గత కొన్ని రోజులుగా భక్తుల్లో అయోమయం నేలకొని ఉంది. కాసేపు బాబా కోలుకుంటున్నారనీ, కాసేపు బాబాగారి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందనీ ఇలా రకరకాల వార్తలతో భక్తులను అయోమయంలో పడేశారు. బాబా ట్రస్ట్ ఆస్తులను కొందరు స్వార్థపరులు తమ చేతుల్లోకి తీసుకునేందుకే, బాబా ఆరోగ్యంపై ఈ నాటకాలాడి ఉండవచ్చని కొందరు భక్తులు అనుమానిస్తున్నారు. ప్రేమ-సేవ తత్వాలని ప్రపంచానికి చాటిచెప్పిన సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు రూపంలో ఆయన జీవించే ఉంటారు.