English | Telugu

స్టార్స్ కి చుక్కలు చూపిస్తున్న మహావతార్ నరసింహ!

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా రెండు వారాలు ఆడటం గగనమైపోయింది. అలాంటిది ఓ యానిమేషన్ ఫిల్మ్ నాలుగో వారంలోనూ సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'మహావతార్ నరసింహ'.

జూలై 24న 'హరి హర వీరమల్లు' విడుదల కాగా, ఆ మరుసటి రోజు జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టింది మహావతార్ నరసింహ. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ మైథలాజికల్ యానిమేషన్ ఫిల్మ్.. కేవలం మౌత్ టాక్ తోనే రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ వచ్చింది. దీంతో 'హరి హర వీరమల్లు'తో పాటు జూలై 31న విడుదలైన 'కింగ్డమ్' కూడా మహావతార్ ముందు నిలబడలేకపోయాయి. 20 రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

అయితే ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' రూపంలో రెండు భారీ సినిమాలు రావడంతో.. ఇక 'మహావతార్ నరసింహ' కలెక్షన్ల జోరుకి బ్రేకులు పడతాయని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. 'వార్-2', 'కూలీ' సినిమాల హవాలోనూ.. మహావతార్ తన జోరు చూపిస్తోంది. ఇప్పటికీ బుక్ మై షోలో గంటకు వేలల్లో టికెట్లు బుక్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో ఇంతటి రన్ ఉన్న సినిమా లేదని చెప్పాలి. ఇప్పటికే రూ.250 కోట్లు రాబట్టిన మహావతార్.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.