English | Telugu
కృష్ణ `గూడుపుఠాణి`కి 50 ఏళ్ళు.. భలేగా ఆకట్టుకున్న ``తనివి తీరలేదే`` గీతం!
Updated : May 26, 2022
సూపర్ స్టార్ కృష్ణ పలు సస్పెన్స్ థ్రిల్లర్స్ లో సందడి చేశారు. వాటిలో `గూడుపుఠాణి` చిత్రం ఒకటి. పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణకి జంటగా శుభ నటించగా హలమ్, చిత్తూరు వి. నాగయ్య, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, ఛాయాదేవి, మిక్కిలినేని, జగ్గారావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ``ఆస్తి కోసం కథానాయికని చంపడానికి విలన్స్ పలుసార్లు ప్రయత్నించడం.. ఆ ప్రయత్నాల నుంచి కథానాయకుడు ఆమెని రక్షించడం`` అనే థీమ్ చుట్టూ అల్లుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో రూపొందిన పాటలకు దిగ్గజ గీత రచయితలు దాశరథి, ఆరుద్ర, కొసరాజు సాహిత్యమందించారు. ఇందులోని పాటల్లో ``తనివి తీరలేదే`` ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``కన్నులైనా తెరవని``, ``పగలు రేయి``, ``వెయ్యకు ఓయ్ మావ చేయి`` వంటి గీతాలు కూడా రంజింజేశాయి. త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై డూండీ సమర్పణలో పి. బాబ్జీ, జి. సాంబశివరావు నిర్మించిన `గూడుపుఠాణి`.. 1972 మే 26 విడుదలైంది. నేటితో ఈ జనరంజక చిత్రం 50 వసంతాలు పూర్తిచేసుకుంది.