English | Telugu

కృష్ణ `నివురు గ‌ప్పిన నిప్పు`కి 40 ఏళ్ళు!

సూప‌ర్ స్టార్ కృష్ణ - అందాల తార జ‌య‌ప్ర‌ద కాంబినేష‌న్ లో ప‌లు ప్రజారంజక చిత్రాలు తెర‌కెక్కాయి. వాటిలో `నివురు గ‌ప్పిన నిప్పు` ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. బాప‌య్య రూపొందించిన ఈ సినిమాలో.. కోలీవుడ్ లెజెండరీ యాక్ట‌ర్ శివాజీ గ‌ణేశ‌న్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా ప్రభాక‌ర్ రెడ్డి, అల్లు రామ‌లింగ‌య్య‌, గిరిబాబు, న‌గేశ్, పేకేటి శివ‌రామ్, గిరిజ‌, న‌ర్రా వెంక‌టేశ్వ‌ర‌రావు, పి.జె. శ‌ర్మ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేశారు. భ‌మిడిపాటి రాధాకృష్ణ ఈ చిత్రానికి ర‌చ‌న చేశారు.

చ‌క్ర‌వ‌ర్తి సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల్లో.. ``అదిగో పులి``, ``అమ్మ చాటు పిల్ల‌నే``, ``చ‌క్క‌ని మాట చెప్పు``, ``గ‌జ్జ క‌ట్ట గ‌ల‌వా``, ``సిగ్గు పోయే ఎగ్గు పోయే``, ``వ‌చ్చాడ‌మ్మా`` అంటూ మొద‌ల‌య్యే గీతాలు రంజింప‌జేశాయి. ఈ పాట‌ల‌న్నింటినీ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, పి. సుశీల గానం చేశారు. విశ్వ ప్ర‌శాంత్ మూవీస్ ప‌తాకంపై ఎ.ఎల్. కుమార్ నిర్మించిన `నివురు గ‌ప్పిన నిప్పు`.. 1982 జూన్ 24న విడుద‌లైంది. కాగా, నేటితో ఈ చిత్రం 40 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.