English | Telugu
జగపతి బాబు `మావిచిగురు`కి 26 ఏళ్ళు!
Updated : May 30, 2022
వెర్సటైల్ స్టార్ జగపతి బాబుని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో `మావిచిగురు` ఒకటి. `శుభలగ్నం` (1994) వంటి సంచలన కుటుంబ కథా చిత్రం అనంతరం జగపతిబాబు - ఆమని జోడీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా కూడా విజయపథంలో పయనించింది. రంజిత మరో నాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, సుబ్బరాయ శర్మ, తనికెళ్ళ భరణి, పీజే శర్మ, గిరిబాబు, బ్రహ్మానందం, బాబూ మోహన్, శ్రీలక్ష్మి, అలీ, శివపార్వతి, శివాజీరాజా, గుండు హనుమంత రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. మధురిమ ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది. ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చారు.
ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో.. ``కోదండరాముడంట``, ``మావిచిగురు తిని``, ``కొమ్మన కులికే``, ``మాట ఇవ్వమ్మా చెల్లి``, ``కొండమల్లి కొండమల్లి``, ``రంజు భలే రాంచిలక`` అంటూ మొదలయ్యే పాటలన్నీ విశేషాదరణ పొందాయి. `ఉత్తమ నటుడు` (జగపతి బాబు), `ఉత్తమ సహాయనటి` (రంజిత), `ఉత్తమ గాయని` (చిత్ర - మాట ఇవ్వమ్మా) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `మావిచిగురు`.. మలయాళంలో `కుంకుమచ్చెప్పు`, తమిళంలో `తొడరుమ్` పేర్లతో రీమేక్ అయింది. స్రవంతి మూవీస్ సమర్పణలో చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై పి. ఉషారాణి నిర్మించిన `మావిచిగురు`.. 1996 మే 30న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 26 వసంతాలను పూర్తిచేసుకుంది.