English | Telugu
బాలయ్య `పాండురంగడు`కి 14 ఏళ్ళు!
Updated : May 30, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో కనువిందు చేశారు. వాటిలో `పాండు రంగడు` ఒకటి. నటరత్న నందమూరి తారక రామారావు నటించిన `పాండురంగ మహాత్మ్యం` (1957) స్ఫూర్తితో తెరకెక్కిన ఈ బయోగ్రాఫికల్ ఫిల్మ్ లో శ్రీ కృష్ణుడిగా, పుండరీక రంగనాథునిగా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమిచ్చారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్యకి జంటగా స్నేహ, టబు నటించగా కె. విశ్వనాథ్, శివపార్వతి, బ్రహ్మానందం, సునీల్, అలీ, ఎల్బీ శ్రీరామ్, ఎం. బాలయ్య, కాంతారావు, సన, సుహాసిని, అర్చన, మేఘనా నాయుడు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. విలక్షణ నటుడు మోహన్ బాబు అతిథి పాత్రలో మెరిశారు. జేకే భారవి కథ, సంభాషణలు సమకూర్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ చిత్రంలో ``మాతృదేవోభవ``, ``గోవిందుడే కోక చుట్టి``, ``ఏమని అడుగను``, ``గోవింద కృష్ణ జై``, ``కోసల దేశపు``, ``శ్రీ శ్రీ శ్రీ రాజాధిరాజా``, ``ప్రేమావలంబనం`` తదితర గీతాలన్ని రంజింపజేశాయి. ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించిన `పాండురంగడు`.. 2008 మే 30న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 14 వసంతాలు పూర్తిచేసుకుంది.