English | Telugu
2013లో స్టార్ హీరోల విశేషాలు
Updated : Dec 31, 2013
"నాయక్", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాల విజయాలతో 2013 సంతోషంగా ప్రారంభమయ్యింది. అభిమానులకు పండగను మరింత పెంచే విధంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి విజయం దక్కిందనే చెప్పుకోవచ్చు. ఈ 2013లో ఎంతమంది హీరోలకు విజయాలు, అపజయాలు కలిగాయో చూద్దామా.!
రామ్ చరణ్: 2013వ సంవత్సరం "నాయక్" చిత్రంతో ప్రారంభమయ్యింది. రామ్ చరణ్ కు ఈ సంవత్సరం "నాయక్" చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ ను ఇచ్చింది. కానీ హిందీ, తెలుగు బాషలో విడుదలైన "తుఫాన్" చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. అయితే ఈ సంక్రాంతికి చరణ్ నటించిన "ఎవడు" చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అదే విధంగా కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం తెరకెక్కనుంది. అంటే 2013 లో చరణ్ కు ఒక హిట్టు, ఒక ఫ్లాప్ తో సమానంగా ఉన్నాడు.
మహేష్ బాబు: "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంతో కుటుంబసమేతంగా చూడదగ్గ మల్టీస్టారర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ నటించిన "1" చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది .ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
వెంకటేష్: "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి మల్టీస్టారర్ చిత్రంతో ఒక విజయాన్ని తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'షాడో" చిత్రం అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది. త్వరలోనే వెంకటేష్ "రాధ" చిత్రంలో నటించనున్నాడు. ఈ ఏడాది వెంకటేష్ కు ఒక హిట్టు, ఒక ఫ్లాప్ లతో సమానంగా ఉన్నాడు.
నాగార్జున : "గ్రీకువీరుడు", "భాయ్" వంటి చిత్రాలతో నాగార్జున ఈ ఏడాది కొత్త ప్రయత్నాలు చేసాడు. కానీ ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోగా... అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ నాగ్ నిర్మాతగా వ్యవహరించిన "ఉయ్యాలా జంపాలా" చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంటే 2013లో నాగ్ కు అన్ని కూడా అపజయాలే తప్ప.. విజయాలు దక్కలేదు.
ప్రభాస్ : "మిర్చి" సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదల తేది 2015 అని దర్శకుడు ప్రకటించేసాడు. మరి 2014లో ప్రభాస్ సినిమా ఏదైనా వస్తుందో లేదో చూడాలి.
అల్లు అర్జున్: ఈ ఏడాది బన్నీ నటించిన "ఇద్దరమ్మాయిలతో" చిత్రం అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది. కానీ ఈ చిత్రం బన్నీ కెరీర్ లోనే స్టైలిష్ చిత్రంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం "రేసుగుర్రం" చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఎన్టీఆర్ : 2013లో "బాద్ షా", "రామయ్యా వస్తావయ్యా" చిత్రాలతో మన ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. ఇందులో "బాద్ షా" పరవాలేదనిపించింది. కానీ "రామయ్యా వస్తావయ్యా" చిత్రం మాత్రం అనుకొని రీతిలో ఘోర పరాజయం పాలయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ "రభస" చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా 2014లో ఎలాంటి విజయాన్ని తారక్ కు అందిస్తుందో చూడాలి.
గోపీచంద్: గోపీచంద్ కు 2013 సంవత్సరం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే... ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు ఈ ఏడాది "సాహసం" చిత్రంతో విజయం దక్కింది. అంతే కాకుండా ఇదే 2013లో గోపీచంద్ పెళ్లి రేష్మాతో జరిగింది. ఓ ఇంటి వాడయ్యాడు. ప్రస్తుతం బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2014లో విడుదల కానుంది. అంటే ఈ ఏడాది గోపీచంద్ చాలా లక్కీ అన్నమాట.
రవితేజ : వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు "బలుపు" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టును అందించింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి 2014లో రవితేజకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.