English | Telugu

జగన్ దేవుడు.. అలాంటి నాయకుడ్ని తిడతానా?.. డా.సుధాకర్ స్వరం మారిందేంటబ్బా!!

మాస్కులు అడిగిన పాపానికి.. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, పిచ్చోడు అనే ముద్ర వేశారన్న అంశం ఏపీలో ఎంత వివాదాస్పదమైనదో తెలిసిందే. అయితే, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. డాక్టర్ సుధాకర్ స్వరం కాస్త మారింది. అప్పుడు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన ఆయన.. ఇప్పుడు సీఎం జగన్ ని దేవుడు అంటున్నారు. అంతేకాదు, తనని క్షమించి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.

కారు తీసుకెళ్లేందుకు విశాఖ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్‌కు డాక్టర్ సుధాకర్ వచ్చారు. ఈ సందర్భంగా సస్పెండ్ దగ్గర నుంచి మానసిక వైద్యశాల ఘటన వరకూ ఏం జరిగిందో వివరించారు. ‘‘సస్పెండ్ అయిన దగ్గర నుంచి బ్యాడ్‌ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. టార్చర్ భరించలేక బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డా. బ్యాంక్ పనిమీద నక్కపల్లి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్తుండగా ఎవరో ఫాలో అవుతున్నారని కారు ఆపా. అప్పటికే కారులో కొంత డబ్బు ఉంది.. వెంబడిస్తున్నారని కారు దిగితే అల్లరిమూకలు తనపై దాడి చేశారు. పోలీసులకు కూడా తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తున్నట్లుగా పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయినా ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది... సీఎం జగన్ గారు నాకు దేవుడు. మోదీ గారిని కూడా నేను తిట్టలేదు. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా?, శత్రువులను కూడా నేను తిట్టను. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం. అలాంటి నాయకుడ్ని తిడతానా?, ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదు" అంటూ చెప్పుకొచ్చారు.

"చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారు. ఆయన హయాంలో కూడా పని చేశాను. కానీ, చంద్రబాబు కార్యకర్తనైతే కాదు. అందరూ బాగానే పాలించారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు. ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకే నాపై దాడి చేశారు. పిచ్చోడి ముద్ర వేసి జాబ్ తీసేయాలని కుట్ర పన్నారు. నాకు గుండు గీసిందెవరో వారి పేరు చెప్పను. చెప్పానంటే మళ్లీ గొడవ మొదలవుతుంది. నేనైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నా. జీతం రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నా. ముఖ్యమంత్రి జగన్ గారు క్షమించి నా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా. తనను ఎవరూ ఉపయోగించుకోలేదు. అలా చేసుంటే వారిపై యాక్షన్ తీసుకోండి. ఆస్పత్రిలో చంపేస్తామని బెదిరిస్తే.. ఇంట్లో వాళ్లు కూడా భయపడ్డారు. మాకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. అవి చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. అలాంటిది రాజకీయాలతో నాకు పనేంటి?, రాజకీయమంటేనే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం’’ అని డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.