English | Telugu

టీడీపీకి స్థానిక ఎన్నికలు ఇప్పుడే వద్దట..!

ఏ పార్టీ అయినా.. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తే.. మానసికంగా ఓటమికి సిద్దమయిందనే విమర్శలు వస్తాయి. ప్రజల్లో కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాయిదాను.. కోరుకుంటోంది.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికే అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ పథకాలు, అధికార యంత్రాంగం సహకారం ఇలా అన్నీ కలిసి వస్తాయి. అయితే.. ఓట్లు వేయాల్సింది ప్రజలే. వారి ఆగ్రహం తీవ్ర స్థాయిలో ఉంటే.. ఇవన్నీ ఏమీ చేయలేవు. కానీ..ఎన్నికల సంఘం కూడా చేతుల్లో ఉంటుంది.. పైగా కొత్త ఆర్డినెన్స్ కూడా తీసుకు వచ్చారు. దీంతో టీడీపీ నేతలు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోతేనే బాగుంటుందని కోరుకుంటున్నారు.

కరోనా వైరస్ ముప్పు ఉన్నందున ఇప్పుడున్న పరిస్థితిలో ప్రచారానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటోంది తెలుగుదేశం పార్టీ. కాబ‌ట్టి స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి బీసీ రిజర్వేషన్లతో పాటు … కరోనాను కూడా కారణంగా చూపిస్తోంది. ఈ మేరకు.. టీడీపీ నేతలు.. ముఖ్య‌మంత్రి జగన్‌కు బహిరంగలేఖ రాశారు.

సుప్రీంకోర్టులో టీడీపీ వేసిన బీసీల రిజర్వేషన్ల పిటిషన్‌లో.. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావాలలని.. లేఖలో ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో 10శాతం కోత విధించి బీసీ హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం బీసీల రాజకీయ అవకాశాల్ని అణిచివేయడమేనని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు.

మరో టీడీపీ బీసీ నేత నిమ్మల కిష్టప్ప మాత్రం ఎన్నికల వాయిదాకు.. కరోనాను కారణంగా చూపిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని.. క్యూలైన్ల ద్వారా కరోనా ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ అంటోంది. చివ‌ర‌కు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలోనూ స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని టిడిపి విజ్ఞ‌ప్తి చేసింది.