English | Telugu

త‌మిళ‌నాట కార్తీక దీపం చిచ్చు! పవన్ ఏమన్నారంటే?

తమిళనాట కొత్త చిచ్చు రేగింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి. ఇంతకీ విషయమేంటంటే.. మ‌ధురైకి ద‌గ్గ‌ర్లో ఉన్న తిరుపుర‌కుండ్రం అనే కుమార స్వామి క్షేత్రంలో కార్తీక దిపానికి సంబంధించినది. త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం. అయితే ఇక్క‌డి ద‌ర్గాకు కుమార‌క్షేత్రానికి చారిత్ర‌క సంబంధాలుండ‌టంతో వివాదం చెల‌రేగింది. ఈ స్తంభంపై కార్తీక దీపం పెట్ట‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో విషయం కాస్తా కాస్తా కోర్టు మెట్లు ఎక్కింది.

ఈ విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు, మ‌ధురై బెంచ్ న్యాయ‌మూర్తి స్వామినాథన్ ఈ దీపం ఇక్క‌డ వెలిగించ‌డానికి అధికారులు త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం.. , ఇక్క‌డ కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చు. అయితే ఇలా చేస్తే మ‌త ఘ‌ర్ష‌ణకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం దీపం పెట్ట‌నివ్వ‌కుండా, హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు కూడా మ‌ధురై బెంచ్ ఇచ్చిన తీర్పునే స‌మ‌ర్ధించింది. దీంతో దీపం వ్య‌వ‌హారంలో తిరుపుర‌కుండ్రంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగింది. ఒక వ‌ర్గం వారు ఇక్క‌డ దీపం వెలిగించాలంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చి పోలీసులు సైతం గాయ‌ప‌డ్డారు.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కార్తీక దీపం వెలిగించాలంటూ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథ‌న్ పై అభిశంస‌న తీర్మాన‌రం పెట్టాల‌ని నిర్ణ‌యించారు ఇండి కూట‌మి ఎంపీలు. వీరంతా క‌ల‌సి ఈ దిశ‌గా ఒక మెమ‌రాండం సైతం స‌మ‌ర్పించారు.

దీనిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హిందూ దేవ‌త‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఏ పార్టీ ఆయ‌నపై అభిశంస‌న పెట్ట‌డానికి ముందుకు రాకపోగా ఆయ‌న్నే వెన‌కేసుకొచ్చార‌న్న పవన్ స్వామినాథ‌న్ ఏం చేశార‌ని అభిశంస‌న పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారో అర్ధం కావ‌డం లేదన్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తకుండా స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్య‌వ‌స‌రం అంటూ ట్వీట్ చేశారు.