English | Telugu

మాన్సాస్‌ భూములపై భూబ‌కాసురుల క‌న్నుప‌డింది!

మాన్సాస్ ట్ర‌స్ట్ రాజ‌కీయాల‌పై తెలుగువ‌న్ గ్రౌండ్ రిపోర్ట్‌

బిజెపి- వైసీపి ఆడుతున్న‌ చ‌ద‌రంగంలో తెలుగుదేశంపార్టీ గిల‌గిల కొట్టుకుంటోంది. రాజ‌ధాని త‌ర‌లింపు పై బిజెపి స్టాండ్ అర్థంకాక త‌ల గోక్కుంటున్న చంద్ర‌బాబునాయుడికి తాజాగా మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం షాక్‌కు గురిచేంది. జీవో రావ‌డం అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌ పదవి నుంచి తప్పించ‌డం, సంచైత గజపతి రాజును నియ‌మించ‌డాన్ని మాజీ ముఖ్య‌మంత్రి జీర్ణించుకోలేక‌పోతున్నారు.

తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం రాజవంశానికి పెద్దదిక్కు లేదా వారసుడ్ని ధర్మకర్తగా ప్రభుత్వం నియమించేది. ఇప్పటివరకు వస్తున్న ఆచారం అదే. అయితే దానిని తుంగలో తొక్కి అశోక్‌ గజపతిరాజు బతికుండగానే తొలగించి సంచైతను నియమించ‌డం వెనుక పెద్ద మాఫియానే వుంద‌ట‌.

మాన్సాస్ ట్రస్టు అధికార మార్పిడి వెనుక రాజకీయ కోణ‌మే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం వుందట‌. అయితే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెలుగుదేశం నేతలు, అటు రాజకుటుంబీకులు జంకుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విశాఖ‌కు త‌ర‌లివెళుతున్న నేప‌థ్యంలో అక్క‌డ భూమికి బాగా డిమాండ్ ఏర్ప‌డిందట‌.

మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో సింహాచలంతో సహా 108 గుడులు, పధ్నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి. విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు.

మాన్సాస్‌ట్రస్ట్‌ భూములను కాజేయడానికే అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌ పదవి నుంచి తప్పించారనే ప్ర‌చారం జిల్లాలో జోరుగా జ‌రుగుతోంది. దొడ్డిదారిన నొక్కేందుకే ర‌హ‌స్య జీవో ఇచ్చారా? అస‌లు మాన్సాస్ భూముల‌పై ముఖ్య‌మంత్రి ఆస‌క్తి ఏమిటి? ఎందుకు సంచిత గజపతిరాజును రంగంలోకి దింపారు?

సంచైత గజపతిరాజు సన అనే ఎన్జీవో నిర్వహిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్, మేధాపాట్కర్ లాంటి వివిధ నేతలతో కలిసి బాలికలకు మరుగుదొడ్లు, తాగునీరు అనే అంశాల్లో పనిచేసి బాగా పేరుపొందారు. సన ఎన్జీవో సంస్థ కూడా ఆనంద్ శర్మ, ఉమాగజపతిరాజు, సంచైతా గజపతిరాజు అనే ముగ్గురి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తోంది. ఢిల్లీలో వుండే సంచిత హుటాహుటిన విశాఖ‌ప‌ట్నంలో ఎన్జీవోను న‌డ‌ప‌డానికి కార‌ణం ఏమిటి? ఇలాంటి ప్ర‌శ్న‌లే అక్క‌డి స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

మాన్సాస్‌ ట్రస్ట్ ను 1958లో పి.వి.జి రాజు తన తండ్రి రాజా సాహెబ్‌ పేరుతో ఏర్పాటు చేశారు. ఉన్నతమైన లక్ష్యం కోసం 14వేల ఎకరాల భూమిని ఇందు కోసం కేటాయించారు. లక్షల మందికి విద్యాదానం చేశారు. విజయనగరాన్ని విద్యా న‌గరంగా తీర్చిదిద్దారు. సాలూరు వద్ద ఎస్టీ చిన్నారుల చదువుకోసం 2వేల ఎకరాలు కేటాయించారు.

ఈ ఆలయం పరిధిలో నాలుగు జిల్లాల్లో 12716 ఎకరాలు ఉండటం ఒక ఎత్తు అయితే.. వీటి విలువ దగ్గర్లో దగ్గర లక్షన్నర కోట్ల మేర ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఈ భూముల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా జగన్ సర్కారు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అనువంశికంగా వస్తున్న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మ‌న్‌గా గతంలో ఈ పదవిని అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు చేపట్టారు. ఆయన మరణానంతరం పెద్ద కొడుకు అనంద గజపతి రాజు ఆ తర్వాత అశోక్ గజపతి రాజు చేపట్టారు. 2016నుంచి ఇదే పదవిలో అశోక్ గజపతి రాజు ఛైర్మ‌న్‌గా ఉన్నారు.

సంచైత గజపతి రాజును సింహాచల దేవస్థానం ఛైర్మన్ గా ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసింది. ఈ ప‌ద‌విలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కొన‌సాగుతున్నారు. ఆయన్ను త‌ప్పించి సంచైతను ఎంపిక చేయటం, ఆమె ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి పదవీబాధ్యతల్ని చేపట్టటం చ‌క చ‌క జ‌రిగిపోయాయి.

అశోక్‌గ‌జ‌ప‌తిరాజును త‌ప్పించ‌డం, సంచైత ను నియ‌మించ‌డం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఢిల్లీ డైరెక్ష‌న్‌లోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఛైర్ పర్సన్ గా సంచైతను నియ‌మించార‌నే టాక్ న‌డుస్తున్న నేప‌థ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచైత కుటుంబం, వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మైయ్యాయి. పేజ్ 3లో రిచ్, పోష్ గా వుండే ఆమెకు ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మంటున్నారు.

అసలు విషయం ఏంటంటే ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆనందగజపతిరాజు గారి నుంచి విడాకులు తీసుకున్న కేరళ రాజకుమారి ఉమాగజపతిరాజు తరువాత రమేష్ శర్మ అనే దర్శకుడిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. తన ఇద్దరు ఆడ పిల్లలతో సహా ఆయనతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరిది పేజ్ 3కుటుంబం చాలా రిచ్, పోష్. రమేష్ శర్మ తను గాంధీ మీద, ఆయన అహింసా సిద్ధాంతం మీద సందేశాత్మక చిత్రానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి పొందారు. తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్త! వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది.

సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్ పర్సన్ గా సంచైతను ఎంపిక చేయటం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ అంటున్నారు. సంచైతా తమ పార్టీకి చెందిన వ్యక్తే అయినా.. నిజం చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల వెన‌క కార‌ణం ఏమిటి? అస‌లు విష‌యాన్ని ప‌క్క దారి ప‌ట్టించ‌డానికే ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని జ‌నం అంట‌న్నారు. టోట‌ల్‌గా టిడిపిని జిల్లా నుంచి తుడిచివేయ‌డానికే బిజెపి వైసిపి ప‌క్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.