English | Telugu
‘స్థానిక’ పోరు పై రచ్చ!
Updated : Mar 7, 2020
ప్రచారం రోజుల తగ్గింపుపై తర్జనభర్జన
డబ్బు,మద్యం పంపిణీపై భిన్నవాదనలు
త్వరలో జరగబోయే మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీలతోపాటు పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్సీపీటీసీల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
పంచాయితీ ఎన్నికల ప్రచారంపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా స్థానికులే పోటీకి అర్హులు, ప్రచార సమయం కుందింపు, డబ్బులు, మద్యం పంపిణీకి పాల్పడితే అనర్హత వేటు వంటి నిర్ణయాలపై రాజకీయ పక్షాల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో జరిగిన పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి పోలింగ్ జరిగే వరకు మధ్యలో 18 నుంచి 20 రోజులు వరకు గడువు ఉండేది. ఈ మధ్యలోనే నామినేషన్ల దాఖలు, పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణ వంటి వాటికి ఒక్కొక్కరోజు అవకాశం ఉంది. అప్పట్లో మూడు దశల్లో జిల్లాలోని అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలకు సంబందించి ఇదే తీరు అమలయ్యింది.
ఎన్నికల ప్రచార సమయం తగ్గడం వల్ల ఓటర్లందరనీ కలుసుకొనే అవకాశం చాలా తక్కువగా ఉందని తేదేపా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరోవైపు నామినేషన్‌దాఖలు, అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఉపసంహరణ వంటి వాటికి ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల పదవులకు స్థానికేతరను పోటీ చేయరాదనే నిబంధన తేదేపా విజయానికి అడ్డుకట్ట వేయటమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్నటి వరకు జడ్పీటీసీ పదవికి సంబందించి జిల్లాలో ఏ మండలం నుంచైనా పోటీచేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో అది ఉండదు.
ఉదాహరణకు జిల్లాపరిషత్ చైర్మన్ పదవిని ఆశించే ఒక నాయకుడు తాను నివాసం ఉంటున్న మండలంలో రిజర్వేషన్ బట్టి పోటీచేసే అవకాశం లేకపోవటంతో తన సామాజిక వర్గానికి రిజర్వయినా ఇతర స్థానం నుంచి పోటీచేసే అవకాశాన్నికోల్పోతారు. ఇది ఇలా ఉండగా రాజకీయ నాయకుల్లో కొంత మంది నిజాయితీపరులు ఖర్చులు తలుచుకొని మనకెందుకులే అంటూ వెనక్కి తగ్గేవారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడేలా అధికారయంత్రాంగం సన్నర్థం కాబోతుంది. మద్యం, డబ్బువంటి పంపిణీ చేస్తే పోటీలో అనర్హులుగా ప్రకటిస్తారు.
ఈ ఆంక్షలు అధికార పార్టీకి కలిసివచ్చే అంశమేనని తేదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మధ్యం,డబ్బు వంటివి పంపిణీ చేసినా చూసిచూడనట్లుగా ఒదిలేసే అధికార యంత్రాంగం ప్రతిపక్షాల చర్యలకు మాత్రం అడ్డుకట్ట వేసేందుకు ఇటువంటి ఆలోచనలు చేసినట్లు కొంతమంది విమర్శిస్తున్నారు.