English | Telugu

భార‌త టాలెంట్ ను చాటుతున్న సైంటిస్ట్‌! డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్!

కోవిద్‌-19 పేరు సూచించింది డాక్ట‌ర్ సౌమ్యానే! కోవిద్‌-19.. అంటే క‌రోనా వైర‌స్‌కు పెట్టిన కొత్త పేరు. ఇది వ్యాధి పేరు. ఈ పేరును ఫిక్స్ చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. అయితే ఆ వైర‌స్‌కు నామ‌క‌ర‌ణం చేసింది మాత్రం మ‌న భార‌తీయ డాక్ట‌రే. ఆ డాక్ట‌ర్ పేరు సౌమ్యా స్వామినాథ‌న్‌. డ‌బ్ల్యూహెచ్‌వోలో ఆమె చీఫ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. సీఓ అంటే క‌రోనా, వీఐ అంటే వైర‌స్‌, డీ అంటే డిసీజ్‌, 19 అంటే 2019లో ఆ వ్యాధి పుట్టింద‌ని అర్థం. వ్యాధుల‌కు పేరు పెట్టాలంటే కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే క‌రోనా వైర‌స్‌కు కోవిద్‌-19 అని పేరు పెట్టిన‌ట్లు డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు.

వ్యాధికి పేరు పెట్టిన‌ప్పుడు ఆ వ్యాధి పేరు ఓ ప్రాంతాన్ని కానీ, న‌గ‌రాన్ని కానీ సూచించ‌కుండా ఉండాలి. వ్యాధి పేరు కూడా ప‌ల‌క‌డానికి ఈజీగా ఉండాలి. క‌న్ఫూజ‌న్ ఉండకూడ‌దు, కానీ లాజిక్ మిస్ కావొద్దు. భ‌విష్య‌త్తు త‌రాలు తెలుసుకునే ర‌కంగా వ్యాధి పేరు ఉండాలి. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే మిగ‌తా వ్యాధుల‌కు కూడా పెరు పెట్టేంత సులువుగా ఉండాల‌ని డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ అన్నారు. హరిత‌విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురే డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్‌.

డాక్ట‌ర్‌ సౌమ్యా స్వామినాథన్‌ బాల్యమంతా మేధావుల సాంగత్యంలోనే గడిచింది. ఈమె తండ్రి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కావటంతో ఇంటికి నోబెల్‌ గ్రహీత సి.వి రామన్‌, మరో ప్రైజ్‌ విన్నర్‌ నోర్మన్‌ బోర్లాగ్‌ వచ్చిపోతూ ఉండేవారు. సౌమ్య మీద ఆ మహానుభావుల ప్రభావం చిన్నతనం నుంచే మొదలైంది. పుణేలో మెడిసిన్‌ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎమ్‌డి చదివి, తర్వాతి శిక్షణ కోసం అమెరికా వెళ్లారామె.

లాస్‌ ఏంజిల్స్‌లోని పిల్లల ఆస్పత్రిలో నియో నాటాలజీ, పీడియాట్రిక్‌ పల్మనాలజీలో ఫెలోషిప్ తో కూడిన శిక్షణ తీసుకున్నారు. 1992లో చెన్నైలోని ట్యుబర్‌క్యులోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పరిశోధకురాలిగా చేరారు. అక్కడే దాదాపు 23 ఏళ్లపాటు పరిశోధనల్లో గడిపారు. అలా వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఫలితంగా, భారతీయ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ (రీసెర్జ్‌)లో సెక్రటరీగా, ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐ.సి.ఎం.ఆర్‌)కు డైరెక్టర్‌ జనరల్‌గా అత్యున్నత పదవులు అలంకరించారు. ఐ.సి.ఎం.ఆర్‌ వందేళ్ల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన రెండో మహిళ సౌమ్యే!

గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎనలేని పరిశోధనలతో, నిరంతర కృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ)లో రెండవ అత్యున్నత పదవిని అలంకరించిన తొలి భారతీయ మహిళగా డాక్ట‌ర్ సౌమ్య చరిత్ర సృష్టించారు.

డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్ పిల్లల వ్యాధులతోపాటు, క్షయ, హెచ్‌ఐవిలో పోషకాహారం పాత్ర...ఇలా ఎన్నో పరిశోధనల్లో నూతన కోణాలను ఆవిష్కరించి పేరు తెచ్చుకున్నారు.

డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్ కు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, టిబి జీరో సిటీ ప్రాజెక్ట్‌ (క్షయ రహిత చెన్నై)లో భాగంగా క్షయను తేలికగాగుర్తించటం కోసం ‘మాలిక్యులర్‌ డయాగ్నొస్టిక్స్‌’ అనే కొత్త పద్ధతిని అవలంబించారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితురాలైన డా.సౌమ్య, బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన మొట్టమొదటి పని సర్రొగసీ బిల్లుకు ప్రత్యేక హోదా కల్పించటం. అంతకుముందు వరకూ అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీలో భాగంగా కొనసాగిన సర్రొగసీ బిల్లును దాన్నుంచి వేరు చేసి అద్దె గర్భం ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కాపాడారు.

వైద్యులు వైద్య వృత్తి దగ్గరే ఆగిపోతే వారి సేవ ఒక పరిధి వరకే పరిమితమవుతుంది. అదే వైద్య పరిశోధనలతో అనారోగ్యాలకు పరిష్కారాలను కనిపెట్టగలిగితే, ఆ సేవ విశ్వవ్యాప్తమవుతుంది.