English | Telugu

ఏకతాటిపైకి 62 దేశాలు.. డబ్ల్యూహెచ్‌వో వేదికగా చైనాకి చుక్కలు

కరోనా మహమ్మారి గుట్టు రట్టు చేసేందుకు 62 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపించింది? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరపాలని అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)ను డిమాండ్‌ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభంకానున్న డబ్ల్యూహెచ్‌వో వార్షిక సదస్సు వేదికగా ఈమేరకు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 62 దేశాలు సిద్ధమయ్యాయి.

అయితే, ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ కు రాసిన ఏడు పేజీల తీర్మానంలో చైనా పేరుకానీ, వూహాన్‌ నగరం పేరుకానీ ఎక్కడా ప్రస్తావించలేదు. చైనా పేరుని ప్రస్తావించకుండానే, చైనా మీద ప్రత్యక్షంగా నిందలు వేయకుండానే.. ఎలాగైనా కరోనా గుట్టుని, చైనా గుట్టుని బట్టబయలు చేయాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.

కరోనా వెలుగుచూసిన తర్వాత తొలిసారి డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ముఖ్యంగా చైనాపై ఆరోపణలు చేస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలు వార్షిక సదస్సును ఓ అవకాశంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు, తనపై వస్తున్న ప్రత్యక్ష, పరోక్ష ఆరోపణలకు డబ్ల్యూహెచ్‌వో వేదికగా సమాధానం ఇచ్చేందుకు చైనా సిద్ధమవుతోంది.