English | Telugu

CAB, NRCల్లో అసలేముంది? అసలు ఉద్దేశమేంటి?

పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండూ విభిన్నమైనవే అయినా ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివి. ఆరెస్సెస్ ప్రతిపాదిస్తున్న హిందూ భావనకు దోహదం చేసేవే. భారతదేశం హిందువులందరికీ మాతృభూమి అనే భావనకు అనుగుణంగానే ఈ రెండు చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అసోం విషయానికి వస్తే....అక్కడ మతంతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అంతా అక్రమ వలసదారులవుతారు. అదే సమయంలో ముస్లిమేతరులు మాత్రం భారత పౌరసత్వం పొందేందుకు మాత్రం వీలవుతుంది. బెంగాల్ విషయానికి వస్తే 1971 మార్చి 24 కంటే ముందు వచ్చిన బంగ్లాదేశీయులకు అందరికీ భారత పౌరసత్వం ఇచ్చేలా 2003లోనే చట్ట సవరణ జరిగింది. తాజా చట్టసవరణతో 2014కు ముందు వచ్చిన వారందరికీ పౌరసత్వ లభించే అవకాశం కలిగింది. కాకపోతే ముస్లిమేతరులు మాత్రమే భారత పౌరసత్వం పొందే వీలుంది.

ఇక నేషనల్ రిజిష్టర్ ఆఫ్ కౌన్సిల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తే....తాము భారతీయులమని రుజువు చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉన్నా.....ముస్లింలపై అది మరింత భారం మోపే అవకాశం ఉంది. అందుకు కారణం....తాము భారత పౌరులమని రుజువు చేసుకోలేకపోయిన ముస్లిమేతరులు శరణార్థులమంటూ భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. ముస్లింల విషయంలో మాత్రం అలా జరిగేందుకు అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే మాత్రం....పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండు వేర్వేరు అంశాలే అయినప్పటికీ ఏదో విధంగా మతంతో ముడిపడినవే. ఆ కారణంగానే ఇది దేశంలో మతపరమైన వాదనలకూ దారితీస్తోంది.

పౌరసత్వ సవరణ అంశం అనేది మతం ఆధారంగా ఉందనేది నిజం. పొరుగున ఉన్న మూడు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చి భారతీయ పౌరసత్వం కోరే వారిని ఇది మతం ప్రాతిపదికన విభజిస్తుంది. పొరుగున్న ఉన్న ముస్లిం దేశాల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా దేశంలో పౌరసత్వం పొందగలుగుతారు. ఇక, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది మతం ఆధారంగా ఉండేది కాదు. ఏ మతానికి చెందిన వారైనప్పటికీ అక్రమంగా వచ్చిన వలసదారులను వెనక్కి పంపడమే దీని ఉద్దేశం.

అయితే, ఎన్సార్సీని దేశవ్యాప్తం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నప్పటికీ... ఇప్పటికైతే ఇది సుప్రీం ఆదేశం మేరకు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. అసోంలోని అక్రమ వలసదారులను గుర్తించి, నిర్బంధించడమే దీని ఉద్దేశం. అసోం మినహా మరే రాష్ట్రానికి కూడా ప్రస్తుతం ఎన్సార్సీ వర్తించదు. అయితే, పౌరసత్వ సవరణ చట్టం మాత్రం యావత్ దేశానికి వర్తిస్తుంది. కొంతమంది ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో పాటించబోమని అంటున్నా రాజ్యాంగరీత్యా వారి మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. అన్ని రాష్ట్రాలు కూడా కచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.