English | Telugu

ముస్లింల ఆందోళన దేనికి? ఈశాన్య రాష్ట్రాల భయమేంటి?

మతాలకు అతీతంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా... ముఖ్యంగా ముస్లింలు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఎందుకంటే, పౌరసత్వ సవరణ చట్టం భారతీయ ముస్లింల హక్కులను నిరాకరిస్తుందనే అపోహ ఉంది. అది నిజం కానేకాదు. ఎందుకంటే, ఆ చట్టం కేవలం మూడు పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే వర్తిస్తుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులు భారతీయ పౌరసత్వాన్ని పొందడాన్ని పౌరసత్వ సవరణ చట్టం సులభం చేస్తుంది. ఇక దేశవ్యాప్త ఎన్నార్సీ అనేది ఇప్పటికైతే ప్రతిపాదిత దశలోనే ఉంది. అది చట్టమైతే, మతంతో సంబంధం లేకుండా అక్రమ వలసదారులందరికీ అది వర్తిస్తుంది.

అయితే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న ఆందోళనలన్నీ ఒకే రకమైనవి కాదు. ఆందోళనలు రెండు రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి... ముస్లింలను మినహాయించినందుకు ఒక రకం ఆందోళన జరుగుతోంది. యూపీ, ఢిల్లీ, కేరళ, బెంగాల్ లో జరుగుతున్న ఆందోళనలు ముస్లింలను మినహాయించినందుకు వ్యతిరేకంగా జరుగుతున్నవే. ఇక రెండో రకం... ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఆందోళనలు... ముస్లింలను మినహాయించినందుకు వ్యతిరేకంగా జరుగుతున్నవి కాదు. శరణార్థులుగా వచ్చే ముస్లిమేతరుల కారణంగా తమ ప్రాంతాల్లో జనాభా తీరుతెన్నులు మారుతాయని, భాషాపరంగా, సంస్కృతిపరంగా తమ హాని కలుగుతుందని, తమకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని జరుగుతున్న ఆందోళన. ఈ రెండింటినీ ఒకే రకంగా చూడలేం.

నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే, చట్టంలో ఆ మేరకు మినహాయింపు ఇచ్చారు. కాకపోతే.... గతంలో ఎన్ని చట్టాలు ఉన్నా...అసోంను అక్రమ వలసదారులు ముంచెత్తారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి. బంగ్లా నుంచి వచ్చే ముస్లిమేతరులు గనుక ఈశాన్య రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే ...అక్కడి ప్రజలు ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, బంగ్లా నుంచి హిందువుల వలసలు అధికమై జనాభా తీరుతెన్నుల్లో మార్పు వస్తుందని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి.

అయితే, పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో.....దేశంలో ఆర్టికల్ 370 రద్దు నాటి పరిస్థితి మళ్లీ ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్ లో మాత్రమే ఉద్రిక్తత నెలకొంటే.... ఇప్పుడు మాత్రం ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగుతున్నారు. దాంతో హింసాకాండ చోటు చేసుకుంది.