English | Telugu
నవంబర్ 11వ తేదీ నుండి స్విగ్గీ, జోమాటో సంస్థలపై నిషేధం!!
Updated : Nov 9, 2019
టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషిలో బద్దకం అంతకు రెట్టింపు పెరుగుతూనే ఉంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పక్కనే ఉన్న అంగడికి కూడా ఎవరూ వెళ్లడం లేదు. చిన్న గుండుసూది నుంచి ఇష్టమైన ఆహారం వరకు అన్నింటిని ఆన్ లైన్ లొనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్ లైన్ సంస్థలు వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ను భారీ డిస్కౌంట్ లతో అందిస్తుండటంతో ఆన్ లైన్ ఫుడ్ కి మరింత డిమాండ్ పెరిగింది. డిమాండ్ సంగతి దేవుడెరుగు..ఆ సంస్థలు మమ్మల్ని మాత్రం మోసం చేస్తున్నాయంటూ వాపోతున్నారు హోటల్స్ యజమానులు. సోమవారం నుంచి స్విగ్గీని నిషేధిస్తున్నామని తేల్చి చెప్పేస్తున్నారు.
వారమంతా కష్టపడి వీకెండ్ లో ఫ్యామిలీతో సరదాగా రెస్టారెంటుకు వెళ్ళేవారి సంఖ్య పూర్తిగా తగ్గి ప్రతి చిన్నవి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసే వారి సంఖ్య పెరిగింది. స్విగ్గీ, జొమాటో వంటి అనేక సంస్థలు.. అందుకు అనుగుణంగా ఆన్ లైన్ యాప్లను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. వివిధ హోటల్స్.. రెస్టారెంట్లతో.. కమిషన్ల లెక్కన ఒప్పందం చేసుకొని ప్రజలకు ఆహార పదార్థాలను చేరవేస్తున్నాయి. హోటల్ కు వచ్చే వారికన్నా ఆన్ లైన్లో వ్యాపారం జోరుగా సాగుతుండటంతో హోటల్ నిర్వాహకులు కూడా స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోక తప్పదని చేసుకుంటున్నాయి.
అయితే 16 నెలల క్రితం కేవలం 0 నుంచి 10 శాతం కమీషన్లతో ఈ ఆన్లైన్ ఆర్డర్ ప్రక్రియను సంస్థలు ప్రారంభించాయి. అప్పుడు ఇరువర్గాలకు లాభం ఉండేదని..ఇటీవల వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడంతో ఆన్లైన్ సంస్థలు 10 శాతం కమిషన్ కాస్త 18 నుంచి 25 శాతానికి పెంచేశాయి. దీంతో హోటల్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ఆన్లైన్ సంస్థల డిమాండ్ల పై విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ నెల 11 నుంచి స్విగ్గీ సంస్థను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
కమీషన్ వ్యవహారం ఎన్నోసార్లు చర్చకు వచ్చినా ఆన్ లైన్ సంస్థల తీరులో మార్పు రాకపోవడంతో వాటి ద్వారా అమ్మకాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఇప్పటికే అంతంత మాత్రంగా హోటల్స్ నిర్వహిస్తున్నామని.. అలాంటిది ఇప్పుడు ఏకంగా 25 శాతం కమీషన్ అంటే నష్టంతో అమ్ముకోవలిసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్ లైన్ సంస్థలు అందినంత వరకు దోచుకొని తమను ముంచాలని చూస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారు హోటల్ యజమానుల సంఘం ప్రతి నిధులు. స్విగ్గీతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చిస్తున్నామని వారు కూడా ఇదే పద్దతిలో ఉంటే ఆ సంస్థలను కూడా నిషేధిస్తామని స్పష్టం చేశారు.