English | Telugu
నేటి నుంచే అమలు.. అమెరికాలో వలస గర్భిణీలకు నో ఎంట్రీ!!
Updated : Jan 24, 2020
అమెరికాలోకి వలసలను నియంత్రించడమే లక్ష్యంగా కఠిన విధానాలను అనుసరిస్తున్న ట్రంప్ సర్కారు మరో కీలక చర్య చేపట్టింది. తమ దేశానికి వచ్చే విదేశీ గర్భిణులపై అంక్షలు విధించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరినీ అమెరికా పౌరుడిగానే పరిగణించి పాస్ పోర్టు మంజూరు చేస్తారు. దీంతో తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఉద్దేశంతో పలు దేశాలకు చెందిన గర్భిణీలు ఆ దేశానికి వెళ్లి కాన్పు చేయించుకుంటున్నారు. అమెరికాకు చెందిన కొన్ని సంస్థలు దీనిని వ్యాపార అవకాశంగా మలచుకుంటున్నాయి. ఈ విధానంపై ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది.
నూతన నిబంధనల ప్రకారం వీసా దరఖాస్తు దారులు ఎవరైనా కాన్పు కోసమే అమెరికాకు రావాలనుకుంటున్నట్లు కౌన్సిలర్ అధికారులు గుర్తిస్తే వారికి పర్యాటక వీసాలు నిరాకరిస్తారు. చికిత్స కోసం వచ్చే ఇతర సాధారణ విదేశీయుల తరహాలోనే వారిని పరిగణిస్తారు. చికిత్స, రవాణా, జీవన ఖర్చులకు అవసరమైన డబ్బు తమ వద్ద ఉందని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. నేటి నుంచే నూతన ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం.