English | Telugu

జగన్ సర్కార్ పై ఉండవల్లి విమర్శల వర్షం.. జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు. ఇళ్ల స్థలాల కోసం కొన్న ఆవ భూములపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని ఉండవల్లి తెలిపారు. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని, అంత ధర ఉండదని తెలిపారు. అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన సీఎం జగన్.. భూముల విషయంలో జరిగిన అవినీతిని ఎందుకు సమర్ధించారని ప్రశ్నించారు. అధిక ధరలకు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామ‌న‌టం ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నం అని విమర్శించారు.

ప్రభుత్వానికి ఇసుక విధానంపై సరైన ముందస్తు ప్రణాళిక లేదని అన్నారు. దీంతో ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని, ఇసుక కష్టాలను ఇప్పటికీ తీర్చలేకపోతున్నారని విమర్శించారు. ఇసుక విధానంలో అవినీతి జరగడం మాత్రమే కాకుండా, కూలీలకు ఉపాధి లేకుండా పోతోందని తెలిపారు.

మద్యం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఉండవల్లి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల కంటే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని అన్నారు. రేటు పెంచితే తాగేవారు తగ్గుతారనుకోవడం భ్రమేనని ఎద్దేవా చేశారు.

అలాగే, రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ ప్రతీకార చర్యలకు పాల్పడడమేంటని ఉండవల్లి ప్రశ్నించారు. జడ్జిలపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. జడ్జిలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉండవల్లి విమర్శించారు. కరోనా నేపథ్యంలో కొంతమంది నియమనిబంధనలు పాటించడంలేదని మండిపడ్డారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కు ధరించకపోతే ఫైన్ వేస్తున్న అధికారులు వాళ్లు ఎందుకు మాస్కులు ధరించడంలేదని ఉండవల్లి ప్రశ్నించారు.