English | Telugu
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!
Updated : Jan 5, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడునవీన్ రావును సిట్ సోమవారం (జనవరి 5) విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.