English | Telugu

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు

ఇటీవల సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీసీ షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. వారంలోపు స‌మాధానం ఇవ్వాల‌ని పార్టీ సూచించింది.

కొద్దిరోజులుగా ప్ర‌భుత్వ విధానాలు, పార్టీ నేత‌ల‌పై ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. తనను బ్ర‌తిమాలితేనే పార్టీలో చేరాన‌ని.. పార్టీ గుర్తు లేకపోయినా సొంతంగా ఎంపీగా గెలవగల సత్తా తనకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తూ ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు.

ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేశారని తెలిపారు. సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని, అనేక సందర్భాలలో మీడియా ముందు పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారని తెలిపారు. ఆ వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు వైసీపీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.