English | Telugu
అందెశ్రీ కుటుంబానికి అండ!
Updated : Jan 3, 2026
ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసన సభలో శనివారం (జనవరి 3) ప్రవేశపెట్టింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టామన్నారు.
1994 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం 7991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి గతం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ఆర్డర్ తెచ్చారని ప్రస్తావించారు మల్లు భట్టి విక్రమార్క. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 573/225, 1.1.1995కి ఇది విరుద్ధమని చెప్పుకొచ్చారు.
వెనుక తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఏపీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్‌గా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 25.11.2025న ప్రాస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డినెన్స్ 88 తెచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్సును బిల్ నంబర్ 7ద్వారా సభ ఆమోదం కోరుతున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.