English | Telugu
టీటీడీ పాలక మండలిలో ఈ అంశాల పై చర్చలు జరగనున్నాయా?
Updated : Oct 23, 2019
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. నలభై నాలుగు అంశాలతో రూపొందించిన అజెండా పై చర్చించనున్న పాలక మండలి సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది. అన్నమయ్య భవన్ లో సమావేశం కానున్న పాలక మండలి నలభై నాలుగు అంశాలతో రూపొందించిన అజెండా పై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా స్విమ్స్ ను టీటీడీ పరిధిలోకి తీసుకురావటంతో పాటు గరుడ భారతికి నిధుల కేటాయింపుపై పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీతో పాటు బాలాజీ రిజర్వాయర్ కి నిధుల మంజూరుపై కూడా పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉద్యోగులను పే స్కేల్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా విధుల్లోకి తీసుకునే అంశంతో పాటు ఇందులో స్ధానికులకు అధిక ప్రాధాన్యత కల్పించే అంశంపై పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. వివిధ టీటీడీ విద్యా సంస్థల్లో హాస్టళ్ల పరిస్థితి నిర్మాణంతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపే అవకాశముంది. ప్రజా సంబంధాల విభాగంలో పని చేస్తున్న ఓఎస్డీకి జీతం పెంపుకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. గతంలో డిప్యూటీ లా ఆఫీసర్ గా విధులు నిర్వహించిన వెంకట సుబ్బనాయుడును ఓఎస్డీ లా విభాగానికి వెంకటశర్మను ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిగా నియమించే అవకాశముంది. ఎస్వీ ఆయుర్వేద కళాశాలల్లో పీజీ కోర్సులకు ఎస్టీ రిజర్వేషన్ లు కల్పించటంతో పాటు టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్యం పై కూడా పాలక మండలి సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఆస్థాన విద్వాంసురాలిగా శోభరాజ్ కు మరో రెండేళ్లు పొడిగింపు కల్పించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.