English | Telugu

ఆ ఐదు మృతదేహాలు ఎక్కడ?

ఎట్టకేలకు రాయల్ వశిష్టా బోటును వెలికితీశారు. ఆపరేషన్ వశిష్ట ముగిసినట్టేనా అంటే లేదనే చెప్పుకోవాలి. బోటు బయటపడితే బోటులో మిగితా మృతదేహాలన్నీ దొరుకుతాయని అంతా భావించారు. కానీ బోటు బయటకొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది. బోటులో పన్నెండు మృతదేహాలు దొరకాల్సి ఉంది. కానీ అందులో కేవలం ఏడు డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. అంటే మిగతా ఐదు మృతదేహాల సంగతేంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగానే మిగిలింది.

సెప్టెంబర్ పదిహేనున రాహుల్ వశిష్ట బోటు నీళ్లలో మునిగింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు అందులో డెబ్బై ఏడు మంది ప్రయాణికులు ఉన్నట్టు లెక్క తేల్చారు అధికారులు. అయితే బోటు మునుగుతున్నప్పుడు ఇరవై ఆరు మందిని కచ్చులూరుకి చెందిన గిరిజనులు కాపాడారు. ఇక నిన్న బోటుతో పాటు బయటపడ్డ ఏడు మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం నలభై ఆరు డెడ్ బాడీస్ బయటకొచ్చాయి. అంటే ఇంకా ఐదు డెడ్ బాడీలు బయటకు రావలసి ఉంది. బోటులో ఆ మృతదేహాలు దొరకలేదంటే అవి నదిలో కొట్టుకు పోయాయో లేక బోటులో ఉన్న వారి సంఖ్య కరెక్ట్ కాదా అన్నది సందేహం. అధికారుల లెక్కల ప్రకారం ప్రమాదం జరిగే సమయంలో బోటులో డెబ్బై ఏడు మంది ఉన్నారని బలంగా వాదిస్తున్నారు అధికారులు. దీంతో ఆ అయిదు మృతదేహాలు ఏమయ్యాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇంతకీ ఐదు మృతదేహాలు ఎవరివి అవి ఎక్కడికి వెళ్లాయి అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. దీంతో బోటును వెలికి తీసినప్పటికీ ఆపరేషన్ వశిష్ట పూర్తి కాలేదని చెప్పాల్సిన పరిస్థితి.