English | Telugu

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

కరోనా ప్రభావం తెలంగాణ పదో తరగతి పరీక్షలపై పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో, పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పదో తరగతి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే కరోనా విజృంభిస్తుండటంతో శుక్రవారం నాడు ఈ విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే, శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరగనుంది. సోమవారం నుంచి ఈనెల 30వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడనున్నాయి. కాగా.. ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.