English | Telugu
మోడీ చెప్పిన మాటకు సరేనన్న నాయుడు!
Updated : Mar 20, 2020
* జగన్ లాంటి ఫ్యూడల్ పాలకుల గురించి రాజ్యాంగ కర్తలు ముందే ఊహించారన్న చంద్రబాబు నాయుడు
ప్రధాని మోడీ తో మొత్తానికి ఇన్నాళ్లకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకీభవించారు. ప్రధాని ఇచ్చిన 'జనతా కర్ఫ్యూ ' పిలుపునకు, నాయుడు చాలా పాజిటివ్ గా స్పందించారు. జనతా కర్ఫ్యూ ను అందరూ విధిగా పాటించాలని సూచించారు. పార్టీ నాయకులతో ఈ రోజు జరిపిన టెలి కాన్ఫెరెన్స్ లో ఆయన ఈ మేరకు, తమ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వివిధ జిల్లాల టిడిపి ప్రజా ప్రతినిధులు, వివిధ జిల్లాల నేతలు ఈ టెలి కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరం అవుతోందని, స్వల్పకాలంలో 177దేశాలకు కరోనా విస్తరించటంతో, 10వేల మందిపైగా కరోనాతో మృతి చెందారని చంద్రబాబు నాయుడు చెప్పారు. " కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలి. ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రధాని మోది ‘‘జనతా కర్ఫ్యూ’’కు పిలుపిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలి. 10ఏళ్ల పిల్లలు,65ఏళ్ల వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, " అని నాయుడు సూచించారు. అలాగే , పత్రాలు, బుక్ లెట్స్ పంపిణి చేయాలని చెప్పారు.
" స్థానిక ఎన్నికల్లో వైసిపి అక్రమాలపై పోరాడాలి. ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు సేకరించాలి. వైసిపి బెదిరింపులపై ఎవిడెన్స్ లు సేకరించాలి, బలవంతపు ఏకగ్రీవాలపై సాక్ష్యాధారాలు సేకరించాలి. అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసికి పంపించాలి. నామినేషన్లు వేయలేక పోయినవాళ్లు అనేకమంది. స్క్రూటినీ లో బలవంతపు ఉపసంహరణలు అనేకం. అభ్యర్ధులను బెదిరించి అనేకం ఏకగ్రీవం చేశారు. 2% ఏకగ్రీవాలు 24%కావడమే ప్రత్యక్ష రుజువు . వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఈసి రాసిన లేఖలో ఈ అక్రమాలన్నీ పేర్కొన్నారు. వైసిపి దాడులు, దౌర్జన్యాలపై కేంద్రానికి నివేదిక పంపినందువల్లనే, ఈసిపై కత్తికట్టారు, కుటుంబాన్ని బెదిరించారు. ఎన్నికల్లో వైసిపి దౌర్జన్యాలపై కోర్టులలో కేసులు వేయాలి. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు న్యాయక్షేత్రంలో పోరాడాలి. ఎన్నికల చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకోవాలి. చట్ట నిబంధనలను అధ్యయనం చేయాలి, విశ్లేషించాలి," అంటూ నాయుడు పార్టీ యంత్రాంగాన్ని ఉత్తేజపరిచారు.
" ఏపిలో ఎన్నికల ప్రధానాధికారికే భద్రతలేదు. ఈసిని ముఖ్యమంత్రి, మంత్రులు బెదిరించారు. ఎన్నికలు వాయిదా వేశారనే వైసిపి అక్కసు. ఈసిపైనే దాడులకు పాల్పడే నైజం వైసిపి నేతలది. ఈసి కుటుంబ సభ్యులకే ఏపిలో రక్షణ లేదు. కేంద్ర బలగాలు ఈసికి రక్షణగా వచ్చాయి. ఈసి లేఖతో వైసిపి అక్కసు రెట్టింపైంది. టిడిపిపై అసత్య ఆరోపణలకు తెగబడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి," అని కూడా పార్టీ యంత్రాంగానికి నాయుడు దిశా నిర్దేశం చేశారు.
" సిఎస్ లేఖలో కరోనా బెడద 4వారాలు లేదన్నారు. లేఖ రాసిన 4రోజుల్లోనే విద్యాసంస్థలు మూశారు.ఆలయాలు, సినిమాహాళ్లు బంద్ చేశారు. దీనిపై సీఎస్, సిఎం ప్రజలకు జవాబివ్వాలి," అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
" కరోనాపై ముఖ్యమంత్రి ఒకరకంగా మాట్లాడారు. మంత్రులు ఇంకోరకంగా మాట్లాడారు.అధికారులు తలోరకంగా కరోనాపై వ్యాఖ్యానాలు. ఒకరికొకరికి పొంతన లేకుండా పోయింది.రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరేం మాట్లాడతారో, ఎవరేం చేస్తారో తెలీని దుస్థితి కరోనా అనేది రోగం కాదని సీఎం అన్నారు. టైఫాయిడ్, ఫ్లూ లాగా కరోనా కామన్ అన్నారు.పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలతో నవ్వులపాలయ్యారు. ప్రజల ఆరోగ్యంతో వైసిపి చెలగాటం ఆడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు వచ్చింది," అంటూ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
" ఒక వ్యవస్థ విఫలమైతే, మరోవ్యవస్థ కాపాడుతుంది. అదే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. అందుకే దేశంలో 4వ్యవస్థలను నెలకొల్పారు. లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్,జ్యుడిషియరీ,మీడియా. ఏ నాలుగు వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలు. ధర్మం నాలుగు పాదాల నడవాలనేది పెద్దలమాట. ఈ నాలుగు వ్యవస్థలపై ప్రజాస్వామ్యం నిలబడాలని మన రాజ్యాంగం చెప్పేది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యూడల్ పాలకులు వస్తారనే అనుమానంతోనే, మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థల ద్వారా కట్టుదిట్టం చేశారు. ఓటు అనేది పౌరుల ప్రాథమిక హక్కు. పోరాడి సాధించుకున్న హక్కు ఓటు. పోటీచేసే హక్కు రాజ్యాంగం కల్పించింది.
నామినేషన్లు వేసే స్వేచ్ఛ అభ్యర్ధులకు ఉండాలి. పౌర హక్కులనే వైసిపి నేతలు కాలరాస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలకు బుద్ది చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి," అంటూ చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను వై ఎస్ ఆర్ సి పి పై సమరానికి సిద్ధం చేశారు.