English | Telugu

తమిళనాట స్టాలిన్ కు షాక్... అనూహ్యంగా పుంజుకున్న అన్నాడీఎంకే...

మరో ఏడాదిన్నరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని కలలు కంటోన్న డీఎంకే అధినేత స్టాలిన్ కు తమిళ ప్రజలు షాకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఏకపక్ష ఫలితాలను సాధించి అన్నాడీఎంకేకు షాకిచ్చిన డీఎంకేకు కేవలం వందే వంద రోజుల్లో ప్రజలు రివర్స్ పంచ్ ఇచ్చారు. తమిళినాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఊహించనివిధంగా అన్నాడీఎంకే విజయం సాధించింది.

జయలలిత మరణం తర్వాత కుమ్ములాటలతో అన్నాడీఎంకే చతికిలపడటంతో... నాలుగు నెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 39 స్థానాలకు 22 సీట్లను డీఎంకే గెలుచుకుంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జోరు మీదున్న డీఎంకే దూకుడుకు ఉపఎన్నికల్లో బ్రేకులు పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఉపఎన్నికల్లోకూడా డీఎంకేనే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ... అనూహ్యంగా అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. మొత్తానికి జయలలిత మరణం తర్వాత అనేక ఒడిదుడులకు గురైన అన్నాడీఎంకేలో ఈ ఉపఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరి, 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ట్రెండ్ ఇలానే కొనసాగుతుందో? లేక డీఎంకేకి పట్టం కడతారో? ఈ రెండు పార్టీలను కాదని రజనీని అందలమెక్కిస్తారో చూడాలి.