English | Telugu
ఉపఎన్నికలంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలు... బైపోల్స్ లో గులాబీ పార్టీకి ఎదురే లేదు
Updated : Oct 24, 2019
నిజమే, ఉపఎన్నికలంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలు... ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపఎన్నికలను కేసీఆర్ అస్త్రంగా మార్చుకుని ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ ప్రజల నాడిని కేంద్రానికి తెలియజేసేందుకు ఉపఎన్నికలను కేసీఆర్ అస్త్రంగా వాడేవారు. పదేపదే రాజీనామాలు చేస్తూ ఉపఎన్నికలకు వెళ్లేవారు. ఉపఎన్నికలకు వెళ్లడమే కాదు... అదేస్థాయిలో ఘనవిజయం సాధించేవారు. దాంతో ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేకపోవడంతో... ఉపఎన్నికలంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలన్నంతా గులాబీ పార్టీ పేరు తెచ్చుకుంది.
అయితే, ఒకే ఒక్కసారి టీఆర్ఎస్ కు చుక్కెదురైంది. వైఎస్ హయాంలో కేసీఆర్ స్ట్రాటజీకి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు ఊహించనివిధంగా ప్రజలు షాకిచ్చారు. ఆ ఒక్క సందర్భంగా మినహా మిగతా అన్ని ఉపఎన్నికల్లోనూ కేసీఆర్ వ్యూహం పక్కాగా వర్కవుట్ అయ్యాయి. ఇక, ఇఫ్పుడు కూడా హుజూర్ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఫలించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం.... కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పాతడం ద్వారా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేదని రుజువైంది.