English | Telugu
తిరుమల కొండపైకి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల
Updated : Aug 19, 2025
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని తిరుమలకు పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించారు. అయితే.. తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో బస్సులలో సీట్లు భర్తీ అయ్యేంత వరకూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తామని ఆయన తెలిపారు. అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండును పరిశీలించిన ఆయన.. బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. బస్టాండులో మహిళల, పురుషుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నేపథ్యంలో పెరిగే మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కొనకళ్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి - పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లబ్దిస్తోందన్నారు.
రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ పది లక్షల మంది, 17వ తేదీ 15 లక్షల మంది, 18వ తేదీ 18లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు రూ.ఆరు కోట్ల 30 లక్షలు లబ్ది కలుగుతుందని వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే మహిళలు, చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.