English | Telugu
కరోనాతో ఇండో అమెరికన్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిబొట్ల మృతి
Updated : Apr 7, 2020
ఇండో – అమెరికాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిభొట్ల కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సుధామ తెలిపారు. అయితే ఆయన తొమ్మిదిరోజుల నుంచి హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మ్ కంచిభొట్ల యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకు కరెస్పాండెంట్‌గా వ్యవహరించారు. అమెరికాలో జర్నలిస్ట్ గా 28సంవత్సరాలు పనిచేశారు. దీంతో పాటు మెర్జర్ మార్కెట్స్ అనే ఫైనాన్సియల్ పబ్లికేషన్‌కు 11సంవత్సరాలు కంటెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. దీంతో పాటు న్యూస్ ఇండియా-టైమ్స్ వీక్లీ న్యూస్ పేపర్‌కు కూడా తన సేవలను అందించారు. బ్రహ్మ్ 1992వరకు భారత్‌లోనే జర్నలిస్ట్‌గా పనిచేసి… ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంబిస్తున్నందువలన బ్రహ్మ్ కంచిభొట్ల అంత్యక్రియలకు కేవలం 10మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయని చెప్పారు ఆయన కుమారుడు సుధామ.
మార్చ్23న తన తండ్రి బ్రహ్మ్ కంచిభొట్లకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు ఆయన సన్నిహితులు. దీంతో డాక్టర్లు చికిత్సను మొదలు పెట్టారని… మార్చ్ 28నాటికి పరిస్థితి విషమించడంతో లాంగ్ ఐలాండ్ అనే హాస్పిటల్‌లో చేర్పించామని.. అప్పటినుంచి బ్రహ్మ్ కంచిభొట్లను వెంటిలేటర్‌పైనే ఉంచారని చెప్పారు. అయితే సోమవారం కార్డియాక్ అరెస్ట్ అయిందని దీంతో బ్రహ్మ్ కంచిభొట్ల చనిపోయారని తెలిపారు. బ్రహ్మ్ కంచిభొట్లకు భార్య అంజనా, కొడుకు సుధామ, కూతురు సియుజనా ఉన్నారు.