English | Telugu

40 మందికి పాజిటివ్ రావ‌డంతో 404కి పెరిగిన కరోనా కేసులు!

ప‌రిస్థితి తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణా స‌ర్కార్ మొత్తం ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజ్‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డానికి సిద్ధ‌మైంది. తెలంగాణాలోని మొత్తం 22 ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజ్‌ల‌ను క‌రోనా రోగుల కోసం ఉప‌యోగించ‌నున్నారు. ఈ కాలేజ్ హాస్పిట‌ల్స్‌లో 12 వేల ప‌డ‌క‌లు సిద్ధం చేశారు.

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మంగళవారానికి 404కు చేరుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే 40 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఈరోజు ఏ ఒక్కరూ డిశ్చార్జి కాలేదని వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు మొత్తం 348 మంది ఉన్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే కరోనా రోగుల సంఖ్యలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (36), వరంగల్ అర్బన్ (23) ఉన్నాయి. జోగులాంబ గద్వాల (22), మేడ్చల్ మల్కాజ్ గిరి (15), ఆదిలాబాద్ (11) జిల్లాల్లోనూ కరోనా తాకిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను కూడా విడుదల చేశారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి హెల్త్ బులెటిన్‌లో వివరించారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగినట్లుగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సీఎస్ అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని వివరించారు.