English | Telugu

ఆదాయం లేదంటే ఆపేయండి.. ఆర్ & బీ, ఇంజనీరింగ్ శాఖ అభివృద్ధి పనులు నిలిపివేత

తెలంగాణలో పంచాయతీ రాజ్ ఆర్ & బీ తో పాటు ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇక ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రాధాన్య పథకాల పనులు మినహా ఇతర అన్ని ఇంజనీరింగ్ పనులు నిలిచిపోనున్నాయి. అత్యవసరం మినహా మిగతా ఏ పనులు చేపట్టవద్దని మౌఖికాదేశాలు ఇప్పటికే పంచాయతీ రాజ్ ఆర్అండ్బీ తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులకు చేరాయి. ముందే మంజూరు చేసి ఉన్నా కూడా ఇప్పటి వరకు పనులు చేపట్టక పోతే వాటిని కూడా ప్రారంభించవద్దని జిల్లాల అధికారులను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు విభాగాల ద్వారా మంజూరు చేసే పనులే కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజక వర్గాల అభివృద్ధి నిధుల కోటాతో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ తో చేపట్టే పనులను కూడా నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. వీటన్నింటిపై యథాతథ స్థితిని కొనసాగించాలన్నది ప్రభుత్వ ఆదేశాల సారాంశంగా చెబుతున్నారు. ఖజానా ఖాళీ కావడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి.

ఆర్ధిక పరిస్థితిని నియంత్రించుకునే దిశగా ఈ నెల పదకొండు న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజుల్లోనే ప్రధాన శాఖల్లో పనులు నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. కొత్త పనులు చేపట్టవద్దని ఆదేశాలు క్షేత్ర స్థాయి అధికారులకు చేరాయి. కేవలం ఉపాధి హామి అత్యవసర పనులను మాత్రమే కొనసాగించాలని ఆదేశించినట్టు సమాచారం. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనంలో 90 శాతం కేంద్రమే మంజూరుచేస్తుంది. వాటిని కూడా కూలీల ఖాతాల్లోనే జమ చేస్తుంది. దాంతో ఈ పనుల నిలిపివేత సాధ్యం కాదు. కానీ ఈ పనుల్లో మెటీరియల్ కాంపోనెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా వెంటనే చెల్లించే పరిస్థితి లేదు. మాంద్యం పరిస్థితులు రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావం తెలంగాణ పై పడిందని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామని సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. మూడు నెలలు గడవక ముందే పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తుంది. పక్షం రోజుల్లో మూడో త్రైమాసికం కూడా పూర్తవుతుంది. ఇప్పటికే అన్ని రకాల పన్నుల ఆదాయాలు తగ్గినట్టు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.

సహజంగా ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే రాబడి ఆదాయం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇందుకు ఇంకా వంద రోజులకు పైగా సమయం ఉన్నా పనులు నిలిపి వేయాలని చెప్పడం అనుమతి లేకుండా కొత్తగా ఒక్క పనిని కూడా చేపట్టవద్దని ఆదేశించడాన్ని చూస్తే చివరికి ఆశించిన స్థాయిలో ఆర్ధిక పరిస్థితులు మెరుగయ్యేలా లేవన్న అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్ల పనులకు సంబంధించి రెండు వేల కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం.అభివృద్ది పనుల కొనసాగింపు కొత్త వాటిని ప్రారంభించడం పై విధించిన అనధికార స్టేటస్ కు ఎప్పటి వరకు కొనసాగుతుందని అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సంవత్సరం చివరికి ఆశించిన మేర ఆదాయం సమకూరుతుందా, ఏమైనా తగ్గే అవకాశం ఉందా అన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమీక్షించిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చే వీలుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక పరిస్థితి చెల్లించాల్సిన బకాయిలు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న పనులు వాటికి అవసరమైన నిధులు తదితర అంశాలను సమీక్షించుకునేందుకు సోమవారం మరోసారి సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సమీక్ష తర్వాత పనుల పై మరింత స్పష్టతతో ప్రభుత్వం ముందుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆదాయం పెరిగితేనే కొత్త సంవత్సరంలో పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.