English | Telugu
టీడీపీ కి చిక్కులు.. కొత్త పార్టీ ఆఫీసు స్థలం పై హైకోర్టు నోటీసులు
Updated : Dec 16, 2019
ఏపీ రాజధాని అమరావతి లోని టిడిపి ఆఫీస్ కు న్యాయపరమైన చిక్కులు ఎదురు కానున్నాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ వైసిపి ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ చేపట్టిన హై కోర్టు.. ప్రభుత్వం, కలెక్టర్, టిడిపికి నోటీసులు జారీ చేసింది. ఇది అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ హై కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి సీసీఎల్ఏ కార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్ టిడిపి అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరులకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధం అని ఆర్కే వాదిస్తున్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో టిడిపి కేంద్ర కార్యాలయం ఈ నెల తొమ్మిదినే ప్రారంభించారు చంద్రబాబు. ఈ స్థలం సర్వే నెంబర్ మూడు వందల తొంభై రెండులో ఉంది. దాదాపు నాలుగు ఎకరాలున్న ఈ భూమిని టిడిపికి తొంభై తొమ్మిదేళ్ల లీజుకిస్తూ 2017లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పుడు ఇదే భూమి వివాదాస్పదమవుతోంది. ఆర్కే పిటిషన్ పై విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అక్రమ కట్టడం అని విమర్శిస్తున్న వైసీపీ ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.